‘రఘునందన్ రావు ఎప్పుడొస్తారో చెప్పండి.. నేనే దగ్గరుండి మా భూమి చూపిస్తా’
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, రుజువు చేస్తే తక్షణమే రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మెప్పుకోసమో, సంచలనాల కోసమో తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. రఘునందన్ రావు తనకు ఉద్యమ సహచరుడని.. ఒక్కప్పుడు కలిసి ఉద్యమంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. రఘునందన్ రావుపై తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. రఘునందన్ రావు వాళ్ళ జిల్లాను వదిలేసి సంబంధం లేని జిల్లాకు వచ్చి తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
39 ఏళ్ల నుంచి నేను ప్రజలతోనే కలిసి ఉంటున్నాను.. భవిష్యత్‌లో ఉంటానని, రఘునందన్ రావు కనీస సమాచారం తెలుసుకోకుండా ఎవరో నాలుగు కాగితాలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఆర్డీఎస్ కాలువ అనేది ఆరోపణలు వచ్చిన భూముల పరిధిలో లేదన్నారు. రఘునందన్ చెప్పిన సర్వే నెంబర్ 60 భూమి మా పరిధిలో లేదు అది శుద్ధ అబద్ధం అన్నారు. పశువులు వస్తున్నాయని కొంత ప్రహరీ గొడ కట్టాము, మొత్తం అంతా పెన్సింగ్ వేశామని తెలిపారు. సర్వే నెంబర్ 60 పై రఘునందన్ రావు సర్వే చేయాలి, ఆయన మా భూముల వద్దకు ఎప్పుడు వస్తారో చెబితే తానే దగ్గర ఉండి చూపిస్తానని మంత్రి అన్నారు.