మునుగోడులో కేటీఆర్ సెల్ఫ్ గోల్.. ఆ ఒక్క మాటతో అడ్డం తిరిగిన కథ?

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ ది కీలక పాత్ర. కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయనే అని గత కొంత కాలంగా ప్రచారమంతా కేటీఆర్ చుట్టే తిరుగుతోంది.

Update: 2022-10-14 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్ ది కీలక పాత్ర. కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయనే అని గత కొంత కాలంగా ప్రచారమంతా కేటీఆర్ చుట్టే తిరుగుతోంది. సందర్భం వచ్చిన ప్రతి సారి కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆరే అనే టాక్ తెరపైకి వస్తోంది. అలాంటి కేటీఆర్ మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బాటలో పయణించడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఆయన చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు ప్రతిపక్షాలకు టార్గెట్ గా చేసింది. కేటీఆర్ మాట పార్టీకి కలిసివచ్చే కంటే చేయబోయే డ్యామేజే ఎక్కువ ఉందా అనే టెన్షన్ అధికార పార్టీలో వినిపిస్తోంది. గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం నిమిత్తం కేటీఆర్ మునుగోడుకు వచ్చారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నదే ఈ ఉప ఎన్నిక అని పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా దత్తత తీసుకుంటాననే మాటే ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతోందట.

మొన్న రేవంత్.. నిన్న కేటీఆర్:

మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. అందువల్ల మునుగోడు టాస్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయాలని అన్ని పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలో గతానికి భిన్నంగా కేటీఆర్ రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ మినహా దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి కేటీఆర్ వెళ్లలేదు. మునుగోడులో నామినేషన్ కార్యక్రమం నుంచే కేటీఆర్ ప్రచారం షురూ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే మునుగోడును దత్తత తీసుకునే విషయంలో నేతల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తిగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపిస్తే తానే స్వయంగా మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మరుసటి రోజే మంత్రి కేటీఆర్ సైతం ఇదే హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని, ప్రతి మూడు నెలలకు ఓ సారి అభివృద్ధిపై పర్యవేక్షిస్తానని చెప్పాడు. తనను నమ్మి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. తన నియోజకవర్గం సిరిసిల్ల తరహాలో మునుగోడును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని ప్రామిస్ చేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తుంటే సొంత పార్టీలో టెన్షన్ మొదలైందలైందనే టాక్ వినిపిస్తోంది.

కేటీఆర్ సెల్ఫ్ గోల్!:

పార్టీకి, పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి మొదటి నుండి తన నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని చెబుతూ వస్తున్నారు. కేటీఆర్ మాటలతో ఇప్పుడు ఇదే నిజమైందని బీజేపీ విమర్శిస్తోంది. నిజానికి తెలంగాణలో అభివృద్ధి అంతా సిరిసిల్లా, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకే పరిమితం అయిందని అన్ని నిధులు ఈ నియోజకవర్గాలకే వెళ్తున్నాయని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరేల కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని, మునుగోడులో ఇన్నాళ్లు అభివృద్ధి జరగలేదని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే అవుతుందని సొంత పార్టీ నేతల్లో చర్చ జరుగుతోందట. ఇదే టాక్ ప్రజల్లోకి వెళ్తే అది మొదటికే మోసం అనే ఆదోళన కనిపిస్తోందట. మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్ రెడ్డి చొరవతీసుకోలేదని టీఆర్ఎస్ వాదించినా మిగతా చోట్ల ప్రతిపక్షాలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తుండటంతో ఆ వాదన నిలబడకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదనే కాన్సెప్ట్ ను మరింత బలపడితే అది తమకు రివర్స్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన టీఆర్ఎస్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేటీఆర్ తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం అని మాట్లాడటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఒక వేళ గెలపించకుంటే మునుగోడును పట్టించుకోరా? కేటీఆర్ మాటలు బ్లాక్ మెయిల్ ను తలపించేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన వారికి అరిటాకుల్లో కాని వారికి కంచాల్లో అన్న సామెత టీఆర్ఎస్ ప్రభుత్వానికి పక్కాగ సరిపోతుందని కేటీఆర్ మరోసారి నిరూపించారని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.

Tags:    

Similar News