ప్రధాన మంత్రిని బ్రోకర్ అని నేను అనలేను: కేటీఆర్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.

Update: 2023-03-27 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి కరీంనగర్‌కు ఏం చేశాడో బండి సంజయ్‌ను నిలదీయండి అని పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు లేవని అన్నారు.

కేంద్రం వివక్ష చూపినా తాము తోచిన కాడికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని అన్నారు. సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరూ అనుకోలేదని, కరువుమెట్ట పంటలు ఉన్న సిరిసిల్ల కోనసీమలాగా మారిందని, అలాంటి అసాధ్యమైన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధ్యం అవుతున్నాయని అన్నారు. దీనిని ప్రజలంతా గుర్తుంచుకోవాలని కోరారు. శత్రుదేశాన్ని చూసినట్లు కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. అయినా, ఇవేమీ పట్టనట్లు తెలంగాణ బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను అనరాని మాటలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కూడా మాటలు వచ్చని, తాము కూడా ప్రధాన మంత్రిని బ్రోకర్ అనగలుగుతామని, కానీ, తమకు సంస్కారం ఉందని, తాము అనలేమని ఎద్దేవా చేశారు.

వ్యక్తి తప్పిదం వల్ల జరిగిన టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తెలిపారు. అసలు జీవితంలో ఎప్పుడైనా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పోటీ పరీక్షలు రాశారా? అని అడిగారు. అలాంటి పరీక్షలు ఎప్పుడైనా రాసి ఉంటే అవి ఎలా నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు అనే విషయాలు తెలిసి ఉండేవని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో 13 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకు అయ్యాయని, అప్పుడు ఏం చేశారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎనిమిదేళ్లుగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేసుకుంటూ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు కేంద్రంలో అమ్ముతోందని అన్నారు. దేశాన్ని తన దోస్తులకు ప్రధాని నరేంద్ర మోడీ దోచి పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News