BRS తొలి ''పాన్ ఇండియా'' సభకు KTR దూరం.. మంత్రి వరుస డుమ్మాలకు కారణమేంటి..?
ఇతర దేశాల నుంచి పెట్టుబడులను, పరిశ్రమల యూనిట్లను తెలంగాణకు తీసుకురావాలన్న టార్గెట్‌తో మంత్రి కేటీఆర్ వారం రోజుల స్విట్జర్లాండ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇతర దేశాల నుంచి పెట్టుబడులను, పరిశ్రమల యూనిట్లను తెలంగాణకు తీసుకురావాలన్న టార్గెట్‌తో మంత్రి కేటీఆర్ వారం రోజుల స్విట్జర్లాండ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి పలువురు అధికారులతో శనివారం రాత్రి దావోస్‌కు బయలుదేరి వెళ్ళారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఆయన అక్కడే ఉండనున్నారు. ప్రతీ సంవత్సరం జనవరిలో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మీటింగులో హాజరయ్యేందుకు ఆ సంస్థ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు వెళ్ళారు. ఫోరమ్ నిర్వహించి పలు సదస్సుల్లో వక్తగా పాల్గొనడంతో పాటు వివిధ అంశాలపై జరిగే రౌండ్ టేబుల్ మీటింగుల్లోనూ పాల్గొంటున్నారు. దీనితో పాటు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులతో విడిగా సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారితో చర్చించనున్నారు.
అన్ని దేశాల వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పెట్టుబడిదారులు, ఆర్థిక వేత్తలు దావోస్ సదస్సుకు హాజరవుతారు. 2018లో తొలిసారి తెలంగాణ ప్రతినిధి బృందం వెళ్ళింది. ఆ తర్వాత 2019, 2020, 2022లో వెళ్ళింది. ఇప్పుడు ఐదోసారి వెళ్ళినట్లయింది. వివిధ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ఒక హబ్‌గా మారిందని తెలియజేయడంతో పాటు రాష్ట్రానికి ఉన్న అనుకూల అంశాలను వివరించేలా స్పెషల్‌గా ఒక పెవిలియన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటైంది. ఏయే దేశాల నుంచి ఇప్పటివరకు ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు, వాటి అనుబంధ యూనిట్లు, పెట్టుబడులు వచ్చాయో ఈ పెవిలియన్ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది.
కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, స్పెషెల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాధ్ రెడ్డి, రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కూడా వెళ్లారు. రాష్ట్రం నుంచి లైఫ్ సైన్సెస్ సంస్థకు చెందిన నాగప్పన్, అటోమోటివ్స్ సంస్థ డైరెక్టర్ గోపాలకృష్ణన్ హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఖమ్మం సభకు గైర్హాజరు..!
బీఆర్ఎస్ ఖమ్మం పట్టణం వేదికగా నిర్వహిస్తున్న తొలి 'పాన్ ఇండియా' సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ ఆఫీసును ఢిల్లీలో డిసెంబరు 14న ఓపెన్ చేసినప్పుడు ఆ పార్టీ నేతలంతా వెళ్ళారు. కానీ ఇన్వెస్టర్ మీటింగ్ ఉందన్న కారణంతో కేటీఆర్ దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లను చేర్చుకుని అక్కడి స్టేట్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశానికి కూడా కేటీఆర్ దూరంగానే ఉన్నారు. బీఆర్ఎస్ తరఫున ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ఏర్పాటు కావడం ఇదే ఫస్ట్ టైమ్. పార్టీ అధినేత కేసీఆర్ తర్వాత 'నెంబర్ టూ' గా ఉన్న కేటీఆర్ ఈ రెండు ముఖ్య కార్యక్రమాలకు వేర్వేరు కారణాలతో గైర్హాజరు కావడం పార్టీలోనే చర్చకు దారితీసింది.
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్ల పార్టీ పేర్కొన్నా.. దావోస్ సదస్సుకు హాజరయ్యే పేరుతో స్విట్జర్లాండ్ టూర్‌కు వెళ్ళారు. ఈ నెల 20వ తేదీ వరకు అక్కడ షెడ్యూలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఖమ్మం సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. వరుసగా మూడో కార్యక్రమం కేటీఆర్ లేకుండానే జరిగిపోతున్నది.
Read more: