గుజరాత్‌ మోసగాళ్లకు ప్రత్యేక రూల్ ఉందా..? ప్రధాని మోడీపై KTR పరోక్ష సెటైర్

వ్యాపారవేత్త మొహుల్ చోక్సీపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్ పోల్ తొలగించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Update: 2023-03-21 12:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యాపారవేత్త మొహుల్ చోక్సీపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్ పోల్ తొలగించడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గుజరాత్‌లోని మోసగాళ్లందరికి ప్రత్యేక మినహాయింపు ఉందా అని నిలదీశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన కేటీఆర్.. రాజా సత్య హరిశ్చంద్రకు మొహుల్ చోక్సీ మరో బంధువు అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్ వేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13 వేల కోట్ల కుంభకోణం కేసులో మోసానికి పాల్పడిన చోక్సీపై ఉన్న రెడ్ కార్నర్ నోటీసును ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. కాగా ఫ్రాన్స్‌లో లియోన్‌లో ఉన్న ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయంలో చోక్సీ పిటిషన్ దాఖలు చేయగా ఈ మేరకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఎత్తివేసింది.

చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసులు విత్ డ్రా చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కొద్ది మంది కోసమే ప్రధాని మోడీ పరిపాలన సాగిస్తున్నారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడికి ప్రభుత్వం విముక్తి కల్పించిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో చోక్సీ మన దేశానికి రావడం అసాధ్యంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News