అందుకు మేము విరుద్ధం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. అడవులు ధ్వంసమవుతున్నాయి.. ఈ నేపథ్యంలో పచ్చదనం పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అటవీ సంరక్షణ, పచ్చదన పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని తమ ప్రజా ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో అటవీశాఖ(Forest Department)కు రూ.1,023 కోట్ల బడ్జెట్ కేటాయించిందని గుర్తుచేశారు. అటవీశాఖ విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హరితహారం పేరుతో హడావుడి చేసి నిధులు దుర్వినియోగం చేసిందని తెలిపారు. అందుకు విరుద్ధంగా తమ ప్రభుత్వం ప్రతి పైసాను సద్వినియోగం చేయడానికి కంకణం కట్టుకుందన్నారు.
2024-25 సంవత్సరానికి 20. 02 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టకుకొని ఇప్పటి వరకు 16.75 కోట్ల మొక్కలు (84 శాతం) నాటాం.. ఈ విషయంలో ఆర్భాటం, ప్రచారాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగర్ వన యోజన కింద రూ. 18.09 కోట్లతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ సహకారంతో ఖమ్మం జిల్లాలోని కనకగిరి, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో రెండు పర్యావరణహిత పర్యాటక ప్రదేశాలను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని వెల్లడించారు.
మెదక్ జిల్లాలో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు, హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్కును ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ నుంచి మొట్టమొదటిసారిగా రెండు గ్రామాలను విజయవంతంగా తమ ప్రభుత్వం తరలించింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడేలను తొలి విడతగా ఖాళీ చేశారని పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుండి నాలుగు గ్రామాల తరలింపు పనులు సాగుతున్నాయని అన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్‌తో కలిపే 1442.26 చదరపు కి.మీల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించేందుకు అటవీశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని చెప్పుకొచ్చారు.
వన్యప్రాణుల దాడులతో ఎవరైన మరణిస్తే వారి కుటుంబసభ్యులకు అందించే నష్టపరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు మా ప్రభుత్వం పెంచింది. గత ప్రభుత్వాల హయాంలో ఆక్రమణలకు గురైన 17,643.30 ఎకరాల భూమిని మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుంది.