రాడార్ సెంటర్‌తో ముప్పు లేదు.. గులాబీ నేతలు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు

వికారాబాద్ జిల్లాలోని దామగూడెం రిజర్వు ఫారెస్టులో ఏర్పాటుకానున్న నేవీ వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్ సెంటర్‌పై బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ చేస్తున్నదని, దేశ అవసరాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో వివాదాలు మంచిది కాదని అటవీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

Update: 2024-01-30 15:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలోని దామగూడెం రిజర్వు ఫారెస్టులో ఏర్పాటుకానున్న నేవీ వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) రాడార్ సెంటర్‌పై బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాజకీయ చేస్తున్నదని, దేశ అవసరాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో వివాదాలు మంచిది కాదని అటవీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. నిజానికి రాడార్ సెంటర్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే అనుమతి మంజూరైందని, జీవో (నెం. 44) కూడా రిలీజ్ అయిందన్నారు. ఈ సెంటర్‌తో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని, పరిసర గ్రామాల్లోని ప్రజలకూ హాని లేదని స్పష్టత ఇచ్చారు. అన్ని కోణాల నుంచి ఆలోచించి, అధ్యయనం చేసిన తర్వాతనే పూర్తి నిర్ధారణకు వచ్చి ఫైనల్ అప్రూవల్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సచివాలయం మీడియా పాయింట్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై క్లారిటీ ఇచ్చారు.

గత ప్రభుత్వం 2017లోనే రాడార్ సెంటర్ నిర్మాణానికి తుది అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ సెంటర్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వివరణ ఇవ్వాల్సి వస్తున్నదని తెలిపారు. రాడార్ సెంటర్ కోసం 2010లోనే ఇండియన్ నేవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టిందని, అప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదని మంత్రి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 2014 ఆగస్టులోనే భూముల బదలాయింపునకు సంబంధించిన డిమాండ్ నోట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేవీకి పంపించిందన్నారు. ఆ తర్వాత 2017 ఫిబ్రవరిలో ప్లాంటేషన్‌కు సంబంధించి స్థల మార్పును సూచిస్తూ నేవీకి మరోసారి ఉత్తరం రాశారని గుర్తుచేశారు. పలు సంప్రదింపుల అనంతరం 2017 డిసెంబర్ 19న జీవో నెంబర్ 44 ద్వారా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ భూములను నేవీకి బదిలీ చేసిందని వివరించారు.

రాడార్ సెంటర్‌లో రాజకీయాలొద్దు :

తెలంగాణలో రాడార్ సెంటర్ ఏర్పాటు దేశ భద్రత, అవసరాలకు సంబంధించిన అంశమని, తెలంగాణ రాష్ట్ర పాత్ర ఉండడం గర్వించదగిన పరిణామమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించి రాజకీయ రంగు పులమడం మంచిది కాదన్నారు. అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ భావిస్తే ఆ పార్టీ విజ్ఞతకే వదిలివేస్తున్నాని తెలిపారు. రాడార్ సెంటర్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య ఆర్థిక లావాదేవీల అనంతరం ప్రక్రియ చివరి దశలో ఉండగా బైసన్ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇస్తేనే చివరి అనుమతులు ఇస్తామంటూ అప్పటి సీఎం కేసీఆర్ పేచీ పెట్టారని మంత్రి కొండా సురేఖ గుర్తుచేశారు.

బైసన్ పోలో గ్రౌండ్‌లో కొత్త సెక్రటేరియట్ కడితేనే తన కొడుకికి ముఖ్యమంత్రి యోగం ఉంటుందనే నమ్మకంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి షరతులు పెట్టారని, చివరకు రాడార్ సెంటర్ ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయన్నారు. కేసీఆర్ షరతులకు కేంద్రం సమ్మతి తెలియజేసినట్లయితే తుది అనుమతులు అప్పుడే ఇచ్చి ఉండేదన్నారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంలో వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోణం నుంచి చూడరాదన్నారు. దేశంలోనే మొదటి సారిగా తమిళనాడులోని తిరునెల్వేలిలో ఏర్పాటైన రాడార్ స్టేషన్ 30 సంవత్సరాలుగా సేవలందిస్తూ ఉన్నదని, ఈ స్టేషన్‌తో చుట్టు పక్కల ప్రాంతం అభివృద్ధి చెందిందని మంత్రి స్పష్టంచేశారు. అవసరమైతే మీడియా మిత్రులను అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తామన్నారు. తిరునల్వేలి తర్వాత రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా వికారాబాద్ నిలువనుందన్నారు.

రాడార్ స్టేషన్ ఏర్పాటు వ్యవహారంలో అంతా చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు దొంగే దొంగా... దొంగా... అని అరిచినట్టుగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను పర్సెంటీజీల కోసం ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి తెలంగాణను దోచుకున్నదన్నారు. ప్రజలను మభ్య పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు నీతి సూత్రాలు చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ భద్రతకు సంబంధించిన రాడార్ సెంటర్ నిర్మాణానికి నాడు అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ నేడు రాజకీయ ప్రయోజనాల కోసం మోకాలడ్డడం హాస్యాస్పందంగా ఉందన్నారు. రాడార్ సెంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిందని నొక్కిచెప్పారు. ఈ ప్రాజెక్టుతో ప్రజలకు ఎలాంటి నష్టం లేనందునే పరిశీలన అనంతరం జీవో విడుదల చేశామన్నారు.

Tags:    

Similar News