కట్టలు తెంచుకున్న కోమటిరెడ్డి కోపం.. ఫస్ట్ టైం CM రేవంత్‌పై పాజిటివ్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పాజిటివ్ కామెంట్స్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. సోమవారం యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదే పదే కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరు అని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని కేటీఆర్‌పై కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచాడు.. ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాడు.. కాంగ్రెస్ పార్టీ అవకావం ఇవ్వడంతో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చాడని కోమటిరెడ్డి వెల్లడించారు.
‘నీ లాగా తండ్రి పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేయడం లేదు’ అని కేటీఆర్‌పై మొదటిసారి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే 50 వేల పైచిలుకు మెజార్టీతో ఓడిపోయారని.. అయినా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మూడోరోజే మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడారని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరైనా.. ఏనాడైనా మూసీ గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితం కావడం చూస్తామన్నారు. ప్రజలు తమిరి కొట్టినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గడం లేదని సీరియస్ అయ్యారు.