కాంగ్రెస్‌తోనే మాకు పోటీ: మంత్రి జగదీశ్‌రెడ్డి
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడానికి అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కారణమని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల ద్వారా భారీ స్థాయిలో లాభాలు
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడానికి అక్కడి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కారణమని మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల ద్వారా భారీ స్థాయిలో లాభాలు పొందడానికే పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని, ఆ స్వార్థమే ఇప్పుడు ఉప ఎన్నికను తీసుకొచ్చిందన్నారు. ధర్మయుద్ధమంటూ కోమటిరెడ్డి కామెంట్ చేస్తున్నారు గానీ, ఈ యుద్ధంలో అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు. బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు ఖాయమన్నారు. హైదరాబాద్‌లో శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మునుగోడులో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంటుంది తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో గానీ, ఆయన పార్టీయైన బీజేపీతో కాదన్నారు. అక్కడ బీజేపీ అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్‌ని అడ్డుకునే కుట్రలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని, దిగజారుడు రాజకీయాలతో బీజేపీ పంచన చేరి నియోజకవర్గ అభివృద్ధి కోమనే టాగ్‌లైన్ తగిలించుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికలో పోటీచేసే అర్హతే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కాలంలోనూ బీజేపీకి కోవర్టుగా పనిచేశారని ఆరోపించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తగిలించాలని బీజేపీ భావిస్తున్నదని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీకి ఓటేస్తే మీటర్లు రావడం ఖాయమన్నారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలకు కూడా ఆమోదం తెలిపినట్లేనని అన్నారు. ఈ బాధల నుంచి ఉపశమనం రావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించడమొక్కటే మార్గమన్నారు.
టీఆర్ఎస్‌లో ఆశావహులే తప్ప అసంతృప్తులు లేరని, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలోగానీ వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోగానీ తమ పార్టీదే గెలుపని, మూడోసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సృష్టిస్తామన్నారు. కాంట్రాక్టు ఒప్పందాల గురించి ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తామన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడిని తిప్పలకు గురిచేస్తున్న బీజేపీని ఆమడదూరం ఉంచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడడానికి కారణం అక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన రాజగోపాల్‌రెడ్డేనని అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిందని, ఈ జిల్లాలో మూడో ఉప ఎన్నికగా వస్తున్న మునుగోడులో సైతం గెలుపు తథ్యమన్నారు.