తెలంగాణకు 13 అవార్డులు.. కేంద్రానికి Thanks చెప్పిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత మిషన్‌లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛ భారత మిషన్‌లో అద్భుత ఆదర్శప్రాయ ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది. దేశంలో నెంబర్ వన్‌తో పాటుగా, వివిధ కేటగిరిల్లో 13 స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. కాగా, అక్టోబర్ 2న, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రానికి ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయనున్నారు. భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ గురువారం రాష్ట్రానికి లేఖ రాశారు. దేశానికి ఆదర్శ ప్రాయమైన అద్భుత ప్రదర్శన తెలంగాణది అంటూ ఆ లేఖలో ప్రశంసలు కురిపించారు. ఎస్ఎస్జీ అవార్డులలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. అదే విధంగా ఎస్ఎస్జీ జిల్లాల కేటగిరీలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా దేశంలో ద్వితీయ ర్యాంక్, నిజామాబాద్ తృతీయ ర్యాంక్ సాధించాయి. ఎస్ఎస్జీ అన్ని టాప్ జిల్లాల జోన్ల కేటగిరీలో నిజామాబాద్ జోన్ దేశంలో రెండో ర్యాంక్, భద్రాది కొత్తగూడెం జోన్ మూడో ర్యాంక్, సుజలం 1.0 కాంపైన్ కేటగిరీ లో తెలంగాణ దేశంలో 3వ ర్యాంక్ సాధించింది. సుజలం 2.0 కాంపైన్ కేటగిరీలో తెలంగాణ దేశంలో 3వ ర్యాంక్, నేషనల్ ఫిలిమ్ కాంపిటీషన్ కేటగిరీలో తెలంగాణ లోని నూకలంపాడు గ్రామ పంచాయతీ (ఎంకురు మండలం) మూడో ర్యాంక్ సాధించింది. అంతేగాకుండా వాల్ పేయింటింగ్ కాంపిటేషన్ ఓడీఎఫ్-ప్లస్ బయో డిగ్రేడబుల్ వ్యర్ధాల మేనేజ్మెంట్, గోబర్ ధాన్, ప్లాస్టిక్ వ్యర్ధాల మేనేజ్మెంట్, మురుగు నీటి మేనేజ్మెంట్, బహిరంగ మల విసర్జన మేనేజ్మెంట్ వంటి కేటగిరీల అవార్డులలో తెలంగాణ రాష్ట్రం సౌత్ జోన్ లో మొదటి ర్యాంకులు సాధించినట్లు లేఖలో వెల్లడించారు.
కేంద్రానికి కృతజ్ఞతలు : మంత్రి ఎర్రబెల్లి
ప్రశంసలు, అవార్డులు ఇచ్చిన కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు ఒక ప్రకటనలో తెలిపారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. అవార్డులు, రివార్డులతో పాటు నిధులు కూడా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఈ- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంట అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా అవార్డులు వచ్చాయన్నారు.