అవార్డులు సరే.. నిధులేవి.. కేంద్రంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అసంతృప్తి

దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ వస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో నిధులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Update: 2023-04-17 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఇచ్చే అవార్డుల్లో తెలంగాణకే ఎక్కువ వస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో నిధులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందువల్లనే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో సోమవారం 13 అవార్డులు అందుకున్న తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తున్నదని, పల్లె ప్రగతి లాంటి ప్రణాళికాబద్ధమైన ప్రోగ్రామ్‌‌లతో పాటు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయడం కూడా దోహదపడిందన్నారు.

అత్యధిక అవార్డులు తెలంగాణలోని పంచాయతీలకే దక్కాయన్నారు. ఒకప్పుడు గంగదేవిపల్లికి మాత్రమే అవార్డులువచ్చేవని, ఇప్పుడు వివిధ కేటగిరీలలో డజనుకుపైగా వస్తున్నాయని, భవిష్యత్తులో మొత్తం 45 అవార్డులూ తెలంగాణకే వచ్చినా ఆశ్చర్యం లేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెల ముఖచిత్రం మారడంలో మిషన్ భగీరథ కీలక భూమిక పోషించిందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా నిధులు ఇవ్వడంలో మాత్రం విఫలమైందన్నారు. చివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల విడుదలకు సైతం కోత పెట్టిందని, రైతు కల్లాలకు నిధుల్ని వినియోగించడాన్ని తప్పుపట్టిందన్నారు. అవార్డులు ఇస్తూనే నిధులను తగ్గించడం సమంజసం కాదన్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధాని,చాలని దీర్ఘకాలంగా విజ్ఞప్తి చేస్తున్నామని, కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదన్నారు. సాగునీటి సౌకర్యాలు పెరగడంతో రాష్ట్రంలో పంట విస్తీర్ణం కూడా పెరిగిందని, కూలీలు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ. 907 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు ఆన్‌లైన్ ద్వారా అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూలీలను అవమనపరచడమే అని అన్నారు.


= నానాజీ దేశ్‌ముఖ్ సర్వోన్నత పంచాయత్ వికాస్ పురస్కార్ కింద కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బ్లాక్ ఉత్తమంగా ఎంపికైంది.

= ఉత్తమ జిల్లా పంచాయతీగా ములుగు జిల్లా ఎంపికైంది.

= గ్రామ్ ఊర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీగా ఆదిలాబాద్ జిల్లా ముక్రా (కే) ఎంపికైంది.

= కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కారానికి రంగారెడ్డి జిల్లా కన్హా (నందిగామ మండలం) ఎంపికైంది.

= ప్రత్యేక కేటగిరీ కింద సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామం ఎంపికైంది.

Tags:    

Similar News