మిల్లర్ల కొర్రీలు, ఐకేపీ నిర్వాహకుల సతాయింపు.. ఆగని ధాన్యం దోపిడీ!

ధాన్యం కొనుగోలు విధానంలో అధికార యంత్రంగా పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2023-05-23 02:54 GMT

దిశ, జనగామ: ధాన్యం కొనుగోలు విధానంలో అధికార యంత్రంగా పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరు మేడిపండు చందంగా మారింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఆయా జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో కొనుగోళ్లలో అమలవుతున్న తీరుకు ఎక్కడా పొంతన లేదు. క్షేత్రస్థాయిలో అడుగడుగునా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తూకాల్లో మోసానికి పాల్పడుతూ అదనంగా ఒకటి, రెండు కిలోల పైనే కాంటాలు పెడుతూ దోచుకుంటున్నారు.

ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో అమలుకు పూర్తి వ్యత్యాసం ఉండడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ నివేదికతో అప్రమత్తమైన సర్కారు పోలీసు వ్యవస్థను సైతం అప్రమత్తం చేసి రైతులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా పోలీస్ అధికార యంత్రాంగం రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి అన్యాయం జరగకుండా చూస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. అయినా కూడా మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల దోపిడీ మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం ఒకపక్క తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచనలు ఇచ్చినప్పటికీ, కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు.

దీంతో అనేకచోట్ల తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తిప్పి పంపడంతో ఆ ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉండిపోతుంది. అంతే కాకుండా జిల్లాలోని కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా 41కిలోలకు బదులుగా 42 కిలోల 200 గ్రాముల చొప్పున బస్తా ధాన్యాన్ని కాంటా పెడుతూ దోచుకుంటున్నారు. అదేమిటంటే మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం లేదని, అందుకే 41 కిలోలకు బదులుగా 42 కిలోల 200గ్రాముల చొప్పున కాంటా పెడుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బ్యాగు 41 కిలోల చొప్పున కాంటాలు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో సంచికి కిలన్నర చొప్పున అదనంగా తీసుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. ఒక రైతు 300 బస్తాలధాన్యం కాంటా పెట్టుకుంటే, ఈ లెక్కన తరుగు పేరుతో మూడున్నర క్వింటాళ్లు కోత విధిస్తున్నారు. ఇది దోపిడీ కాదా అని పలువురు అంటున్నారు.

నిస్సహాయ స్థితిలో రైతులు..

కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యాన్ని తిరిగి తీసుకుపోలేక తప్పనిసరి పరిస్థితుల్లో కాంటా పెట్టి రైతులు నష్టపోతున్నారు. వాస్తవానికి అనేకచోట్ల, మిల్లర్లు, ఐకేపీ నిర్వాహకులు, ధాన్యం కొనుగోలుదారులు కలిసి రైతులను దోపిడీకి గురిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ ప్రమేయం ఏమీ లేదని, మిల్లర్లు దిగుమతి చేసుకోకపోవడంతోనే అదనంగా ఒక కిలో చొప్పున కాంటా పెడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి సందర్భంలో సివిల్ సప్లయ్​ అధికారులు మిల్లర్ల వద్ద నిఘా పెట్టి కోత విధించకుండా చూడాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో అది అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్కడో ఒక్కచోట ఇలా జరుగుతుంది తమకేందంటూ ఎవరికి వారు చేతులు ముడుచుకొని కూర్చోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పైకి అంతా బాగానే ఉంది అన్నట్లుగా ఎవరికి వారు సర్ది చెప్పుకుంటూ అధికారులకు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధలు వర్ణనాతీతం అని చెప్పాలి. ధాన్యం తీసుకువెళ్లి వారం పది రోజులు గడిచినా రైతులకు గన్నీ బ్యాగులు అందడం లేదు. ఒకవేళ గన్నీ బ్యాగులు దొరికినా, సదరు ధాన్యం సకాలంలో కాంట కావడం లేదు. కాంటాలు అయినా, లారీలు అందుబాటులో లేక ధాన్యాన్ని అక్కడికి నుంచి లిఫ్ట్ చేయలేని పరిస్థితి. కష్టపడి ధాన్యాన్ని లిఫ్ట్ చేసినా మిల్లర్లు అనేక కొర్రీలు పెడుతూ ఇబ్బందులు పెడుతూ తాలు పేరుతో తూకాల్లో కోత విధిస్తున్నారు. ఇలా రైతులను ఇబ్బంది చేస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News