ఇంతలా ఎండ మండిపోవడానికి కారణమిదే.. వాతావరణ శాఖ క్లారిటీ
రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో.. పలువురు అల్లాడిపోతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో.. పలువురు అల్లాడిపోతున్నారు. ఉష్ణతాపం తీవ్రంగా ఉండడంతో మరికొందరు విస్తుపోతున్నారు. పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రత కంటే .. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ పడిపోవడంతో ఎండ పెరగడానికి కారణమని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. రానున్న రెండు రోజుల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. అత్యవసరం అనుకుంటే తప్ప.. బయటకు వెళ్లొద్దని.. ఒకవేళ వెళ్లినా.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
మరికొన్ని జిల్లాల్లో..
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల , కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చిరించింది. ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాలలో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ... ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణ పేట, కామారెడ్డి, ములుగు, జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read More..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
Summer Drinks: ఈ ఐదు జ్యూసులు తాగండి.. ఒంట్లో వేడి పరార్ అవ్వాల్సిందే...?