మేరా పీచే కౌన్ హై.. మాలుమ్? ఆ దందాలో ఇది కామన్
కొద్దిరోజుల కిందట కోకాపేటలో ఓ ల్యాండ్ ఇష్యూ జరిగింది.
‘‘ కొద్దిరోజుల కిందట కోకాపేటలో ఓ ల్యాండ్ ఇష్యూ జరిగింది. రెండు ప్రైవేటు పార్టీల మధ్య గొడవ చోటుచేసుకుంది. అయితే.. ఇరువర్గాల పక్షాన ఎమ్మెల్యేల అనుచరులు వచ్చారు. వారు అధికారులకు ఫోన్లు చేశారు. ఎటూ తేల్చలేకపోయారు. ఇందులో రూరల్ ఎమ్మెల్యే అనుచరులు అర్బన్ ల్యాండ్ ఇష్యూలో పాల్గొన్నారు. ఇదే మొదలు కాదు. ఆఖరు కూడా కాదు. రాజధాని నగరంలో పాటు సమీప ప్రాంతాల్లో ఎకరం రూ.కోట్లు పలికే ప్రతి భూ దందా, గొడవ వెనకాల ప్రజాప్రతినిధుల పేర్లు వినిపిస్తున్నాయి. వారి పేరు చెప్పుకుంటూ కొందరు అనుచరులు.. పీఏలు హల్ చల్ చేస్తున్నారు.’’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొందరు ప్రజాప్రతినిధుల ఆదాయ మార్గమంతా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగమే. అడుగు ముందుకేస్తే.. ప్రత్యక్ష భాగస్వామ్యం కూడా. మరికొందరిది బినామీల పర్వం. ప్రతి దందా వెనుక ఎవరో ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. ఆఖరికి మంత్రి పేరు కూడా వినిపిస్తుంది. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, డెవలపర్ ని కలిసినా.. మేరా పీచే కౌన్ హై! మాలుమ్? అంటున్నారు. అక్రమాలను తనిఖీ చేసేందుకు వెళ్తే.. అధికారులకూ అదే మాట ఎదురొస్తుంది.
అక్రమార్కులు తమ మాయాజాలంతో ప్రభుత్వ పెద్దల పేర్లను కూడా వల్లిస్తున్నారు. ప్రతి బిల్డర్, కంపెనీ ప్రతినిధుల నోట.. ఫలానా మంత్రికి వాటా ఉందని, ఎమ్మెల్యే కొడుకు తమ కంపెనీలో డైరెక్టర్ అంటూ చెప్తుండడం గమనార్హం. కొందరు ఉన్నతాధికారులు కూడా తమ బంధువులన్నట్లుగా చెబుతుంటారు. వారితో మాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. మేం ఏం చెబితే అదే ఫైనల్. అంతెందుకు ఈ వెంచర్.. ఈ విల్లా ప్రాజెక్ట్ వారిదే. మేము జస్ట్ భాగస్వాములం. ఉద్యోగులం మాత్రమే. రోజూ కలుసుకుంటాం. అందుకే మా ప్రాజెక్టుకు వెంటనే అనుమతులు వచ్చేస్తాయ్. మీ పెట్టుబడికి మా గ్యారంటీ అంటూ సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు.
నిజమెంతో, అబద్ధమెంతో.. కానీ..
రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపైనే రూ.వందల కోట్లు సంపాదించేందుకు చాలామంది అక్రమార్కులు పెద్దోళ్లు పేర్లతోనే జపం చేస్తున్నారు. నిజమెంతో, అబద్ధమెంతో.. కానీ వారితో సన్నిహితంగా మెలిగిన అంశాలు రూఢీ చేస్తున్నాయి. వాళ్ల మద్దతుతోనే రియల్ ఎస్టేట్‌లో అక్రమాల జోరు నడుస్తున్నది. రూ.వందలు, వేల కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కొందరు మంత్రుల పేర్లు అధికారికంగానైతే లేవు. కానీ కనీసం వారి పేర్లు, ముఖం కూడా చూసి ఉండకపోవచ్చు. ఆ మంత్రుల పేర్లు చెప్పడం ద్వారా త్వరితగతిన పనులు అవుతాయన్న ప్రచారం ఉంది.
సాహితీ, ఐరా, ఫార్చూన్ 99 హోమ్స్, ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ, భువనతేజ, ఆర్జే గ్రూప్, ఐరా రియాల్టీ, ఈఐపీఎల్, హోల్ మార్క్ కన్స్ట్రక్షన్, అర్బన్ రైజ్, సుమధుర వంటి అనేక కంపెనీలు ప్రాజెక్టులు మొదలుపెట్టక ముందే జనం వద్ద డబ్బులు వసూలు చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆఖరికి రూ.వందల కోట్లు కూడబెట్టుకున్న కొన్ని సంస్థలపైనా కేసులు కూడా నమోదయ్యాయి. అలాంటి వాటి వెనుక కూడా ప్రజాప్రతినిధులే ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. తెర వెనుక వాళ్లు ఉండడం వల్లే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల పేరిట..
భాగ్యనగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. శివారు ప్రాంతాలు అనేకం కలిసిపోయాయి. గ్రామ పంచాయతీలు పోయి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా అవతరించాయి. దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడేమో రీజినల్ రింగ్ రోడ్డు ప్రస్తావన కూడా పెద్ద ప్రచార ఆయుధంగా మారింది. ప్రతి ప్రాజెక్టు ప్రచారంలో ఈ రెండు పేర్లు తప్పకుండా వినిపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు మధ్య గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్టుమెంట్లు, వెంచర్లలో పాట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిల్లో అనుమతులు తీసుకోకుండానే దందా మొదలు పెట్టే సంస్థల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
సదరు కంపెనీల ప్రారంభోత్సవానికి, వివిధ సందర్భాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటున్నారు. వాటినే ప్రచారంగా వాడుకుంటున్నారు. నిజానికి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల పేరిట లెక్క లేనన్ని కంపెనీలు ఉన్నాయి. కన్సల్టెన్సీలు, ఆగ్రో ఫీడ్, ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్, హోమ్స్ అండ్ ఇన్ఫ్రాటెక్, పార్క్స్ అండ్ రిసార్ట్స్, ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ టెక్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఫుడ్ అండ్ అలైడ్స్, క్యాపిటల్ ప్రైవేట్, క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. విల్లా ప్రాజెక్టుల్లోనూ డైరెక్టర్లుగా ఉన్నారు. దీంతో మార్కెటింగ్ ఈజీగా మారుతున్నది.
భూముల కొనుగోళ్లు, అనుమతులు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు.. అన్ని పనులు చకచకా సాగిపోతున్నాయి. అదే క్రమంలో ప్రీలాంచ్ ఆఫర్లతో ముందే సొమ్ము చేసుకుంటున్నారు. రూ.వందల కోట్లు కూడబెట్టి మరో చోట ల్యాండ్స్ కొనుగోళ్లకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రకటించిన సమయానికి ఫ్లాట్స్ అందించని క్రమంలో ఎదురుతిరిగే కస్టమర్లకు పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగివ్వడానికి వెనుకడుగు వేయడం లేదు. మూడు, నాలుగేండ్ల తర్వాత వాళ్లు కట్టిన సొమ్మే తిరిగి పొందిన బాధితులు కూడా ఉన్నారు. ఇంకొందరేమో పైసా కూడా రాకపోవడంతో అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారు.
గొడవలు.. సెటిల్మెంట్లు కామన్
ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని గండిపేట, శేరిలింగంపల్లి, ఇబ్రహింపట్నం, రాజేంద్రనగర్, శంషాబాద్, బాలాపూర్, మహేశ్వరం, కందుకూరు, మేడ్చల్, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి, దుండిగల్, బీబీనగర్ తదితర మండలాల్లో వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నది. అనేక లావాదేవీల్లో గొడవలు.. ఆ తర్వాత సెటిల్మెంట్లు కామన్ గా మారాయి. ప్రతి చోటా పెద్దోళ్ల పేర్లు వినిపించకుండా ఉండడం లేదు. ఆ పేర్లు వినగానే సామాన్యులు వణికిపోతున్నారు. ఆఖరికి సాహితీ కంపెనీ రూ.వందల కోట్లు ముంచేసి చేతులెత్తేసింది. దీని వెనుక కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం. సదరు కంపెనీకి ల్యాండ్స్ ఇప్పించడం, సెటిల్మెంట్ చేసి పెట్టడంలో వారు కీలక భూమికి పోషించారని తెలిసింది. ఐరా, ప్రెస్టేజ్, ఫార్చూన్ 99 హోమ్స్ వంటి కంపెనీల వెనుక కూడా పెద్ద లీడర్స్ ఉన్నారనే సమాచారం. అందుకే ప్రీలాంచ్ ఆఫర్ల కింద మొదటే ఫ్లాట్లు అమ్మేశారని, ఆధారాలు ఇచ్చినా రెరా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయడం విశేషం.
ఆఫర్ల పేరిట భారీగా మార్కెటింగ్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోకాపేట, చేవెళ్ల, సదాశివపేట్, షాద్ నగర్, జహీరాబాద్, యాదాద్రి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘట్ కేసర్, బీబీనగర్, చౌటుప్పల్, చిట్యాల, శామీర్‌పేట్, శంషాబాద్, కడ్తాల్, ఆమన్‌గల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటైన వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల్లో అధికంగా అనుమతులు లేనివే. కొందరైతే పాత ఎల్పీ నెంబర్ వేసి కొత్త వెంచర్‌ను అమ్ముతున్నారు. పైగా పది ఎకరాలకు అనుమతి ఉంటుంది. 50 ఎకరాలకు మార్కెటింగ్ చేస్తున్నారు.
కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు వందలాది మంది మార్కెటింగ్ సిబ్బందిని పెట్టి ముందే అమ్మకానికి పెడుతుంటాయి. టీమ్ సభ్యులకు పెద్ద ఆఫర్లు ప్రకటిస్తాయి. ఒక్క ప్లాట్ అమ్మితే గోవా టూర్, మూడు ప్లాట్లు అమ్మితే బ్యాంకాక్ టూర్, పది ప్లాట్లు అమ్మితే కారు సొంతమంటూ ఆకర్షిస్తుంటాయి. మాయమాటలను నమ్మిన ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఏండ్లు గడిచినా ఆ వెంచర్లకు పర్మిషన్లు రాకపోగా ప్రశ్నిస్తే.. తమకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక బాధితులు వెనుదిరుగుతున్నారు. ఇచ్చిన అమౌంట్ వస్తే చాలంటూ సంతృప్తిపడుతున్నారు.
ఏవి చర్యలు?
రియల్ అక్రమాలపై హెచ్ఎండీఏ, డీటీసీపీ, రెరా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలాంటి దందాలపై ఎలాంటి నియంత్రణ లేదు. ప్రచారమేమో కొండంత. క్షేత్రస్థాయిలో ఎలాంటి డెవలప్ మెంట్ కనిపించదు. వెంచర్లలో కనీసం రోడ్లు కూడా ఉండవు. బ్రోచర్లు, వెబ్‌సైట్ గ్రాఫిక్స్ మాయాజాలంతోనే అంతా నడిపిస్తుంటారు. ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నామనే బిల్డప్ ఇస్తుంటారు.
దశాబ్దాలు గడుస్తున్నా ఫైనల్ లే అవుట్ అప్రూవల్స్ పొందని సంస్థలే 90 శాతం ఉన్నాయి. ఇన్నేండ్లయినా ఎందుకు వెంచర్ డెవలప్ చేయలేదని అడిగే వ్యవస్థనే లేదు. ఇలాంటివాటిని ఆదిలోనే అడ్డుకోకపోతే ఓ సాహితీనో, ఇంకో జయ గ్రూప్ లానో బాధితులు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.