కష్టాల్లో 475 కస్తూర్భా గాంధీ బాలికల స్కూళ్లు

రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయాలను అప్పులతో నెట్టుకు రావాల్సి వస్తున్నదని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

Update: 2022-09-20 13:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయాలను అప్పులతో నెట్టుకు రావాల్సి వస్తున్నదని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్​మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. ఆరు నెలలుగా బడ్జెట్​విడుదల కాకపోవడంతో తమ వేతనాల నుంచే హాస్టల్​నిర్వహించాల్సి వస్తున్నదన్నారు. స్థానికంగానూ అప్పులు చేసి మరీ నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులతో పాటు స్టాఫ్ కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్పస్టం చేశారు. మరోవైపు స్వల్ప సంఘటనలకు కూడా ఎస్ ఓ(స్పెషల్ ఆఫీసర్)ను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. నిర్ధోషిగా తేలినప్పటికీ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉన్నతాధికారులు అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ స్కూళ్లు బాగుపడాలంటే వెంటనే విద్యార్థినుల మెస్​ఛార్జీలను ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలన్నారు. ఇంటర్​విద్యార్థినులకు అదనంగా ఫర్​క్యాపిటా నిర్ణయించాలన్నారు. కాస్మోటిక్​చార్జీలు, హాస్టళ్ల మెయింటెనెన్స్​కోసం కనీసం ఒక్కో దానికి రూ.50 వేలు చొప్పున మంజూరు చేయాలన్నారు. ఏప్రిల్​నుంచి పెండింగ్‌లో ఉన్న మెస్​బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలన్నారు. హాస్టళ్లలో కేర్​టేకర్‌లను నియమించాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లను ప్రిన్సిపాళ్లుగా మార్చాలన్నారు.

Tags:    

Similar News