Medical Admissions: మెడికల్ అడ్మిషన్లలో లోకల్ లొల్లి.. జీవో 114 Vs జీవో 33

రాష్ట్రంలోని మెడికల్ అడ్మిషన్లలో స్థానికతపై అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది.

Update: 2024-08-08 02:49 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మెడికల్ అడ్మిషన్లలో స్థానికతపై అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది. స్థానికతను గుర్తించడం కోసం గత ప్రభుత్వం తెచ్చిన జీవో 114, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 33 తో రెండు పార్టీల మధ్య వార్ నెలకొన్నది. కొత్త జీవో వల్ల తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్, తాము పాత జీవోలోనే కొన్ని మార్పులు చేశామని కాంగ్రెస్.. ఇలా పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

ఇదే అంశంపై ప్రస్తుత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు హరీశ్‌​రావు, కేటీఆర్‌ల మధ్య హాట్ హాట్‌గా కౌంటర్లు కొనసాగుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై లొల్లి కంటిన్యూ అవుతునే ఉన్నది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై రెండు పొలిటికల్ నేతలతో పాటు ఎక్స్‌పర్ట్స్ విభిన్న తీరులో అభిప్రాయాలను చెప్తున్నారు. దీంతో స్టూడెంట్స్‌తో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోపై స్పష్టంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఓ మెడికల్ ప్రొఫెసర్ పేర్కొన్నారు.

ఆ రెండు జీవోల్లో ఏముంది.. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు కోటా ఉన్నది. ఇది మెడికల్ సీట్ల అడ్మిషన్లలోనూ వర్తిస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు సీట్లు కేటాయించబోమని చెప్తూనే, లోకల్ కోటాపై మార్గదర్శకాలు ఇస్తూ, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసకొని జీవో 114 తీసుకువచ్చారు. దీనిలో స్థానికత కోసం రెండు క్లాజ్‌లను పొందుపరిచారు.

9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ కంటిన్యూగా 4 సంవత్సరాలు తెలంగాణలో చదివి ఉండాలని, లేదా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ ఉన్న ఏడేండ్లలో, ఏవైనా 4 ఏండ్లు తెలంగాణలో, మూడు ఏండ్లు ఆంధ్రలో చదివి ఉన్నా లోకల్ కింద పరిగణిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే జూన్ 2తో పునర్విభజన చట్టం పూర్తైన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన మార్గదర్శకాలను జీవో 33 పేరిట సవరించింది. దీనిలో 2017లో లోకల్ ఎంపిక కోసం బీఆర్ఎస్ తీసుకువచ్చిన జీవోలోని రెండు క్లాజ్‌లలో ఒకదాన్ని తొలగించి, కేవలం 9 నుంచి 12 వరకు తెలంగాణలో చదవినోళ్లనే లోకల్ కింద పరిగణిస్తామని తెలిపింది. రెండో ఆప్షన్ ఇవ్వకుండానే లోకల్ ఎంపికపై క్లియర్ కట్‌గా చెప్పేశారు.

అసలు ఎందుకీ వివాదం.. 

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 33 ద్వారా ఏపీ విద్యార్థులకే ఎక్కువ మేలు జరుగుతుందనేది బీఆర్ఎస్ వాదన. మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఎక్కువ ఉన్నందున 8 తరగతి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏపీ స్టూడెంట్స్ వచ్చి చదువుతారని, ఇంటర్ వరకు ఇక్కడే ఉంటే తెలంగాణ స్థానికతను పొందుతారని బీఆర్ఎస్ లీడర్లు వివరిస్తున్నారు. అక్కడ పేరుగాంచిన మెడికల్ కాలేజీలు లేనందున ఇదే ట్రెండ్ కొనసాగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తాము 2017 జీవో తెచ్చిన సమయంలో కూడా కొత్త మెడికల్ కాలేజీల్లో ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో పునర్విభజన చట్టం రూల్స్‌ను ఇంప్లిమెంట్ చేయబోమని, పాత కాలేజీల్లో మాత్రమే అడ్మిషన్లు ఇస్తామని నొక్కి చెప్పినట్టు మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

మరోవైపు ఇదే సమయంలో టెన్త్ తర్వాత ఇతర రాష్ట్రాలకు కోచింగ్‌కు వెళ్తే, మన విద్యార్థులు ఇక్కడ నాన్ లోకల్ కోటాలో పడిపోతారనేది ఆయన వాదన. గతంలో ఉన్న 6 నుంచి 10 వ తరగతి రూల్‌ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత మంది ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారని, ఇటీవల కొంత మంది స్టూడెంట్స్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. తాము తెచ్చిన రూల్‌లో టెన్త్, ఇంటర్‌లో బోర్డు ఎగ్జామ్ ఉంటుందని, దీంతో ఫేక్‌కు చాన్స్ తక్కువేనని కాంగ్రెస్ లీడర్లు వివరిస్తున్నారు. గతంలో ఉన్న రూల్ కంటే ఇప్పుడు తెచ్చిన రూల్ మరింత బెటర్‌గా ఉంటుందని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ వెల్లడిస్తున్నారు. ఇదేమీ తాము కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కాదని, దీని వల్ల ఆంధ్ర స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందన్న వాదనలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. 

Tags:    

Similar News