యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి : మేడ్చల్ అదనపు కలెక్టర్

పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు

Update: 2024-10-15 13:25 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ, ఓటరు నమోదు శాతం పెరగడం లేదని అన్నారు. వార్డు మెంబర్ల భాగస్వామ్యంతో యువత కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు నమోదు చేసుకునేలా చూడాలని పార్టీ ప్రతినిధులను కోరారు.

జిల్లాలో ఓటరు నమోదు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో ఓటర్లకు అనుకూలంగా ఉండేలా, 1500 మంది ఓటర్లకు ఒక పొలింగ్ బూత్ చొప్పున అదనంగా 38 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గాల వారిగా మేడ్చల్ లో 21, మల్కాజిగిరిలో 7, కుత్బుల్లాపూర్ లో 10 పోలింగ్ బూత్ లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2435 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు. ఓటర్లకు సమీపంగా, సౌకర్యవంతంగా ఉండేలా పరిశీలించి ఈ బూత్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల నంబర్ల సవరింపులో కొన్ని పాత బూత్ ల నంబర్లు మారుతాయని, బూత్ పోలింగ్ అధికారులు ఈ మార్పు పై ఓటర్లకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టరు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ రెడ్డి, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News