కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రూ.లక్ష కోట్లు కావాలి : ఈటల
పొలిటికల్ లీడర్ కి కూడా మెరిట్ ఉండాలని, పేదల బాధలు
దిశ, మేడ్చల్ బ్యూరో: పొలిటికల్ లీడర్ కి కూడా మెరిట్ ఉండాలని, పేదల బాధలు అర్థంచేసుకొనే మెరిట్ ఉండాలని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.ఎలక్షన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తప్ప.. పీపుల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ పై రేవంత్ రెడ్డి ఆలోచన చేయడం లేదని విమర్శించారు. నాలుకకు నరం లేకుండా రేవంత్ హామీలు ఇచ్చారని మండి పడ్డారు.సోమవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం వినాయక నగర్ లో వాకర్స్ తో సమావేశమై తనకు మద్దతు తెలపాలని ఈటల రాజేందర్ అభ్యర్థించారు.ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ఆగస్టు లో రుణమాఫీ అమలు చేస్తా అని రేవంత్ చెప్తున్నాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసినవాడిగా ఎలా నమ్మాలో అర్థం కావడం లేదన్నారు. లిక్కర్ అమ్మితే వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హామీతో పెరిగిన పెన్షన్ వల్ల 44 లక్షల మందికి రూ.23 వేల కోట్లు అవసరమవుతాయన్నారు.రూ.2500 చొప్పున కోటిన్నర మందికి రూ. 40 వేల కోట్లు కావాలని,ఇలా ఇచ్చిన హామీలకు లక్ష కోట్లు అవుతుందని, ఆ నిధులను రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకువస్తారో.. మేధావులు చర్చ పెట్టాలని కోరారు.నేను ఊరికే దండం పెట్టె కల్చర్ ఉన్నవాణ్ణి కాదని, సేవచేసే వాడినన్నారు.ప్రజా ఉద్యమంలో ఇందిరాపార్క్ దగ్గర వేసిన ప్రతి టెంట్ కింద నా గొంతుక వినిపించినవాన్నని తెలిపారు.
సేవకులేవరో తెలుసుకోని ఓటెయ్యండి..
సేవకులేవరో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులెవరో తెలుసుకోని ఓటు వేయాలని ఈటల రాజేందర్ కోరారు.ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి పనులు చేయించే సత్తా ఉన్నవాడిని తెలిపారు. డబ్బుకు, లిక్కరుకు, ప్రలోభాలకు ప్రజలు ఓటు వేస్తారని నేను నమ్మననన్నారు. మొదటిసారి గెలవడం సులభం. కానీ రెండోసారి గెలవాలి అంటే ప్రజల ప్రేమ పొందాలి. మోడీ ఎంత ప్రేమ పొంది ఉంటే మూడోసారి కూడా గెలవబోతున్నారో.. అర్థం చేసుకోవాలని అన్నారు.7 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే స్థితికి ఎదిగిన భారతదేశంలో ఇంకా గుడిసెల్లో బ్రతికేవారు ఉన్నారు. ఏదైనా జబ్బు వస్తే డబ్బులు లేక చచ్చిపోయే పరిస్థితి ఇంకా చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. వన్ నేషన్ టాక్స్ మన్మోహన్ సింగ్ ప్రపోజల్ పెట్టిన ఐదు ఏళ్ళు అమలు చేయలేకపోయారని, మోడీ వచ్చాక అమలు చేసి చూపించారని వివరించారు. జీఎస్టీ మొదలు పెట్టిన సంవత్సరం రూ. 73 వేల కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు జీఎస్టీ ఆదాయం రూ. 1.85 కోట్లు అని పేర్కొన్నారు..11 వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం మోడీ నాయకత్వంలో 5 వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని,3 వ స్థానానికి తీసుకువచ్చేందుకు మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.. సమస్త సంపద పేదలకు అందాలనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారని తెలిపారు.
చంద్రమండలం మీద అడుగుపెడుతున్న యుగంలో ఊర్లలో టాయిలెట్స్ లేకపోవడం పై స్పందించిన ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ పేరుతో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. మోదీ హయాంలో స్కాములు లేవని,50 కోట్ల మందికి జనధన్ అకౌంట్ లు ఓపెన్ చేసి డిజిటల్ ట్రాంజాక్షన్ ను అమలు చేసే స్థాయికి తీసుకువచ్చారని తెలిపారు.దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు.. ఒకప్పుడు వీసా రిజెక్ట్ చేసిన అమెరికా ఇప్పుడు మోడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని అన్నారు.భరతజాతి ఆత్మగౌరవం విదేశాల్లో బాగా పెరిగిందన్నారు. 73 ఏళ్ళ మోడీకి ఒక్కనాడు జ్వరం వచ్చింది అని పడుకోలేదని,కమిట్మెంట్ ఉన్న లీడర్ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బీజేపీ నాయకులు వీకే మహేష్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.