మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : కర్ణాటక మంత్రి
మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కర్ణాటక రాష్ట్ర ఆర్
దిశ, కూకట్పల్లి: మైనారిటీల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కర్ణాటక రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్‌కు మద్దతుగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో నిర్వహించిన మైనారిటీల సమావేశానికి కర్ణాటక ఆర్ అండ్ బీ శాఖ మంత్రి జమీర్ అహ్మద్, శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అహ్మద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో మైనారిటీల అభ్యున్నతికి పాటు పడే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 వేల కోట్లతో మైనారిటి డిక్లరేషన్ ప్రకటించిన మైనారిటీల అభివృద్ధి, అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించిందని అన్నారు.
అనంతరం శివాజీ నగర్ ఎమ్మెల్యే రిజ్వాన్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీలు తమ సంపూర్ణ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, హస్మత్ పేట్ చెరువు సుందరీకరణ చేశామని గొప్పలు చెప్పుకుని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు. చెరువు చుట్టుపక్కల ఉన్న భూములను ఎమ్మెల్యే, అతడి అనుచరులు కబ్జాలు చేయడం తప్ప చెరువు సుందరీకరణ ఎక్కడ జరగలేదని అన్నారు. డివిజన్లో 50 లక్షలతో నిర్మించిన మాడల్ మార్కెట్ నాలుగు సంవత్సరాలైన ఇప్పటికి ప్రారంభానికి నోచుకోలేదని అన్నారు.
డివిజన్లో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందు సీసీ రోడ్లు వేసి డివిజన్ అంత అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అంజయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఓటు హక్కు లేదు కాబట్టి మౌలిక వసతులు కల్పించడం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో మైనారిటీలకు మైనారిటి బంధు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి రుణాలు అందించడంలో ఎమ్మెల్యే విఫలం అయ్యాడని అన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ మాట ఇచ్చిన బీఆర్ఎస్ గత పది సంవత్సరాలుగా దాటవేస్తూ వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల కోసం 4 వేల కోట్లతో మైనారిటి డిక్లరేషన్‌ను ప్రకటించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్చార్జి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, టీపీసీసీ కార్యదర్శి దండుగుల యాదగిరి, ఎండి మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.