Gram Panchayat : విలీన ’పంచాయితీ‘

విలీన పంచాయితీ ముదురుతోంది. రాజకీయ జోక్యంతో పీక్ స్టేజీకి వెల్లుతోంది.

Update: 2024-08-03 10:48 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : విలీన పంచాయితీ ముదురుతోంది. రాజకీయ జోక్యంతో పీక్ స్టేజీకి వెల్లుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శివారు గ్రామాలు, మున్సిపాలిటీలను విలీనం చేస్తున్న విధితమే. గ్రేటర్ విస్తరణలో భాగంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపుల మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని 45 గ్రామాలను విలీనం చేయనుంది. ఇందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని అత్యధిక గ్రామాలు విలీనం కానున్నాయి. అయితే మేడ్చల్ జిల్లాలోని గ్రామాల విలీనం పై గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఆ మూడు గ్రామాల పై అనిశ్చితి..

జిల్లాలోని ఔటర్ కు ఇరువైపుల ఉన్న గ్రామాల విలీనం పై అయోమయ పరిస్థితి నెలకొంది. ఘట్ కేసర్ మండలంలోని చౌదరిగూడ, వెంకటాపూర్, కాచవాని సింగారం, ప్రతాప సింగారం, కొర్రెముల గ్రామాలను పక్కనున్న పోచారం మున్సిపాలిటీలో విలీనం చేయనుండగా, ఘట్ కేసర్ మున్సిపాలిటీలో మర్రిపల్లి గూడ, ఏదులాబాద్, ఘనాపూర్ గ్రామాలను కలపనున్నారు. అయితే అదే ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాల పై ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ మూడు గ్రామాల విలీనం పై అనిశ్చితి నెలకొంది. దీంతో అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం ఈ మూడు గ్రామాలను పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాల అవతల (యాదాద్రి భువనగిరిని అనుకుని ) ఉన్న ఏదులాబాద్ గ్రామాన్ని ఘట్ కేసర్ మున్సిపాలిటీలో కలుపగా, ఈ మూడు గ్రామాల పై వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పంచాయితీ రాజ్ మినిష్టర్ సీతక్కను కలిసి స్థానిక బీజేపీ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, మచ్చ సందీప్ నేత తదితరులు వినతి పత్రం అందజేశారు. మా మూడు గ్రామాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో కలుపొద్దని విన్నవించారు.

విలీనం.. గందరగోళం..

మేడ్చల్ మండలంలోని పూడురుతో పాటు, శామీర్ పేట, కీసర మండల హెడ్ క్వార్టర్లుగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలను ప్రత్యేక మున్సిపాలిటీలను చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు అవతల మూడు కీలోమీటర్ల దూరంలో పూడురు గ్రామం ఉందని, తాజాగా మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో సైతం ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలను మాత్రమే విలీనం చేయాలని ఉన్నట్లు మాజీ సర్పంచ్ బాబుయాదవ్ పేర్కొంటున్నారు. తాజాగా దానా కిషోర్ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్దంగా పూడురు గ్రామాన్ని ఏలా విలీనం చేస్తారని బాబు యాదవ్ ప్రశ్నిస్తున్నారు.

గతంలోనే గుండ్ల పోచంపల్లిలో మున్సిపాలిటీలో పూడురు గ్రామాన్ని విలీనం చేసేందుకు యత్నించిగా అడ్డుకున్నామని, పూడురు అమ్లెట్ విలేజీగా ఉన్న అరుకుల గూడాను వదులుకోవడంతో పాటు సర్వే నెంబర్ 411 నుంచి 463 వరకు ఉన్న దాదాపు 500 ఎకరాల స్థలాన్ని కోల్పోయామని బాబుయాదవ్ తెలియజేశారు. పూడురును గ్రామపంచాయితీ గానే కొనసాగించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ గౌతమ్ ను కలిసి బాబు యాదవ్ వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా శామీర్ పేట గ్రామాన్ని సైతం తూంకుంట మున్సిపాలిటీలో విలీనం చేయద్దని, ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీటీసీ సుదర్శన్ డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ కుట్రనే.. ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నేత, ఘట్ కేసర్ మాజీ ఎంపీపీ

ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను రాజకీయ దురుద్దేశ్యంతోనే యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడని, కలెక్టర్ ను బెదిరిస్తూ.. ఆయన పై ఒత్తిడి తెచ్చి మూడు గ్రామాలను మేడ్చల్ జిల్లాలో లేకుండా చేస్తున్నారు. సుధీర్ రెడ్డి తన స్వార్ధం, రాజకీయ ప్రయోజనాల కోసం స్థానిక ప్రజల అభిష్టానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కల దృష్టికి తీసుకువెళ్లుతున్నాం.

పూడురుకు మినహాయింపు ఇవ్వాలి.. బాబు యాదవ్, మాజీ సర్పంచ్, పూడురు

పూడురు గ్రామాన్ని గుండ్ల పోచంపల్లిలో విలీనం చేయాలని చూస్తే గతంలోనే వ్యతిరేకించాయి. అందుకోసం పూడురు అమ్లెట్ విలేజ్ అరుకుల గూడను వదులుకున్నాయి. దాంతో పాటు సర్వేనెంబర్లు 411 నుంచి 463 వరకు ఉన్న 500 ఎకరాలను గుండ్ల పోచంపల్లిలో కలిపేందుకు అంగీకరించాం. ఔటర్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పూడురు గ్రామాన్ని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయద్దు.. పూడురుకు విలీనం చేయకుండా మినహాయింపు ఇవ్వాలి..

Tags:    

Similar News