కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో ‘త్రిపుర ల్యాండ్ మార్క్’ బాగోతం..
ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసి ఓ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.
దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసి ఓ వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే. మరోవైపు కొన్ని ‘రియల్’ కంపెనీలు కబ్జాల పర్వం కొనసాగిస్తున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వ్యాపారాన్ని చేస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ‘త్రిపుర ల్యాండ్ మార్క్’ కంపెనీ చేపట్టిన ఐదు ప్రాజెక్టులు ఇలాగే ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో త్రిపుర ల్యాండ్ మార్క్ ఐదు ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, బోరంపేట రెవెన్యూ పరిధిలో త్రిపుర ల్యాండ్ మార్క్ - 4, డి పోచంపల్లి రెవెన్యూ పరిధిలో త్రిపుర ల్యాండ్ మార్క్-5 ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కంపెనీ త్రిపుర ల్యాండ్ మార్క్-3 ప్రాజెక్టు పక్కనే త్రిపుర ల్యాండ్ మార్క్-4 ప్రాజెక్టు చేపట్టింది. కొంత ప్రభుత్వ భూమితో పాటు కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను ఆక్రమించి ఈ నిర్మాణాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. త్రిపుర ల్యాండ్ మార్క్-5 నిర్మాణాలు డి పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని పడగ సముద్రం చెరువు కట్ట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను ఆక్రమించి చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అక్కడే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కొంతమేర కలిపేసుకుని నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
అనుమతులు ఎలా ?
2018లో బోరంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో కోమటికుంట చెరువు పక్కనే సర్వేనెంబర్ 241లో త్రిపుర ల్యాండ్ మార్క్-3 ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న సర్వే నంబర్ 225 ప్రభుత్వ భూమిలో ఎమినిటీస్ భవనాలను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. త్రిపుర ల్యాండ్ మార్క్-4 ప్రాజెక్ట్ లో కూడా ఇదే ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని కలిపేసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఈ నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తున్నది. డిపోచంపల్లిలో ఉన్న పడగసముద్రం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తో పాటు సర్వే నెంబర్ 181లోని కొంత భాగంలో త్రిపుర ల్యాండ్ మార్క్ -5 ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తో పాటు ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసుకునేందుకు హెచ్ఎండీఏ అనుమతులు ఎలా ఇచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ పట్టా భూముల్లో అనుమతులు పొంది, పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లోని కొంత భాగాన్ని కలిపేసుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.