హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు
హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
దిశ, కూకట్పల్లి : హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సికింద్రబాద్ ముత్తాలమ్మ ఆలయం వద్ద జరిగిన పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడిన యువకుడు సాయిని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆదివారం హస్మత్‌పేట్‌లోని బాధితుని నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మట్లాడుతూ గడిచిన రెండు నెలలుగా వరుసగా ఆరు దేవాలయాల మీద దాడులు జరిగాయని అన్నారు. హైదరాబాద్ అడ్డాగా ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వందల సంఖ్యలో వచ్చి శిక్షణ శిబిరాల పేరిట ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. ముత్యాలమ్మ ఆలయం మీద దాడి జరిగిన అనంతరం తానే స్వయంగా ఫిర్యాదు చేశానని, పిచ్చోళ్లు చేసిన పని కాదు, ఇది కావాలనే మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారని అన్నారు.
సమగ్రమైన దర్యాప్తు చేసి ప్రజలకు విశ్వాసం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదని ఆరోపించారు. సంఘటనపై కేంద్ర హోంశాఖకు ఉత్తరం రాశానని తెలిపారు. హిందు ధర్మాన్ని ఎవరు దెబ్బతీసినా ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజలందరూ సమన్వయంతో కలిసి కట్టుగా ఉండాలని కోరారు. సాయితో పాటు వెంకటేష్, రఘు వంటి అనేక మందిపై పోలీసులు లాఠీచార్జి చేశారని, పిల్లల రక్తం కాదు చిందించాల్సిందని, దుర్మార్గులను శిక్షించాలని కోరారు. ఆలయాల జోలికి రావాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు, నాయినేని సూర్య ప్రకాష్ రావు, అర్షనపల్లి సూర్యారావు, బోయిన్పల్లి డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.