ఆత్మ గౌరవాన్ని వెలకట్టే దుస్ధితి దేశంలో నెలకొంది: ఈటల రాజేందర్
ఊర్లలో సర్పంచిని కావాలన్న ఎంపీపీని చేయాలన్న నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో: ఊర్లలో సర్పంచిని కావాలన్న ఎంపీపీని చేయాలన్న నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నారు. ఆత్మగౌరవాన్ని వెల కట్టే దుస్థితి ఈ దేశంలో వచ్చిందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన కామెంట్ చేశారు.పైసలు ఉంటేనే ఎమ్మెల్యే , కార్పొరేటర్, ఎంపీ అయ్యే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి గీతా నగర్ పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఎల్.బి.నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని వాసవి శ్రీ నిలయంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. పొలిటికల్ లీడర్‌కి మెరిట్ ఏంటంటే ఎంత డబ్బుంది, ఎంత దాదాగిరీ చేయగలడు ఇదే మెరిట్ తప్ప ప్రజల జీవితాలు ఏంటి ? మనం ఏం చేయాలి అన్న మెరిట్ లేదన్నారు. ప్రపంచంలో చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు ప్రజలే అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించే సత్తా వారికే ఉంటుందని తెలిపారు. కానీ ఇప్పుడున్న క్రైటీరియాలో ఎట్లా సంపాదించాలో తెలియదు కానీ, సంపాదించాలి. ఖర్చు పెట్టాలి.. మళ్ళీ సంపాదించాలి ఇది నేటి రాజకీయమన్నారు. మల్కాజ్గిరి లో బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు అభ్యర్థులను మార్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా ముగ్గురు నలుగురు అభ్యర్థులను మార్చారన్నారు."
కేసీఆర్‌కు నామీద కోపముంది.. మరీ రేవంత్ కెందీ
కేసీఆర్‌కి నా మీద కోపం ఉంది.. మరీ నీకేముందని రేవంత్‌ని అడిగాను. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు భయం పట్టుకున్నట్లుంది.. ఈటల రాజేందర్ గెలిస్తే మెడ మీద కత్తి ఉన్నట్టే అని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ వాళ్లు మేము ఎలాగో పోతున్నామని, ఒకవేళ బీజేపీ ప్రతిపక్ష హోదాకొస్తే మనల్ని మింగేస్తది వాళ్లే మళ్లీ అధికారంలోకి వస్తారనుకుంటుందని గులాబీ లీడర్లు భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇద్దరు కలిసి నన్ను తొక్కలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కాపాడగలిగే శక్తి మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉందన్నారు.
పదవి అమ్మ నాన్న ఇస్తే వచ్చేదో.. కొనుక్కుంటే వచ్చేదో.. కాదన్నారు. ప్రజల ఆత్మలు ఆవిష్కరించి ఆశీర్వదిస్తేనే పదవి వస్తుందన్నారు. ఈ దేశంలో 75 మంది కేబినెట్ మంత్రులు ఉంటే 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత బిడ్డలు, ఎనిమిది మంది గిరిజన బిడ్డలు, ఐదు మంది మైనారిటీ బిడ్డలను మంత్రలు చేసిన ఘనత ప్రధాని మోడీదేనన్నారు. ఈ ఎన్నికల్లో గెలువబోయే 370 ఎంపీ సీట్లలో తాను ఉండాలని అశపడుతున్నాను. తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఓటు వేయాలని ఈటల అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.