నడిరోడ్డుపై నోట్లను విసిరేస్తూ హల్​చల్​ చేసిన యువకులు..

ఇన్​స్టాగ్రామ్​లో లైకు సంపాదించేందుకు, ఫాలోవర్స్​ పెంచుకునేందుకు

Update: 2024-08-22 14:17 GMT

దిశ, కూకట్​పల్లి: ఇన్​స్టాగ్రామ్​లో లైకు సంపాదించేందుకు, ఫాలోవర్స్​ పెంచుకునేందుకు యువత చేస్తున్న వికృత చేష్టలు సామాన్య జనానికి తలనొప్పిగా మారుతున్నాయి. ఇన్​స్టాగ్రామ్​లో పవర్​ హర్ష అనే ఐడి ఉన్న ఓ యువకుడు కూకట్​పల్లి ప్రాంతంలో నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ, బైక్​పై వెళుతూ డబ్బులు విసురుతున్న వీడియోలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి. బెట్టింగ్​ సైట్​లను ప్రమోట్​ చేస్తున్న ఇన్​స్టాగ్రామ్​ ఇన్​ఫ్ల్యూయెన్సర్​లపై ఓ వ్యక్తి ఈ మధ్య పోరాటం ప్రారంభించిన క్రమంలో ఇలా డబ్బులు విసిరేసిన వీడియోలను సదరు వ్యక్తి బయట పెట్టడంతో ఈ వీడియోలు మరింత వైరల్​గా మారాయి. ఇన్​స్టాగ్రామ్​లో పవర్​ హర్ష అనే పేరుతో ఉన్న ఐడికి సంబంధించిన ప్రొఫైల్​లో సదరు చేస్తున్న వికృత చేష్టలు చూసిన ప్రతి ఒక్కరు యువకుడి చర్యలకు వ్యతిరేకంగా కామెంట్​లు చేస్తు వ్యతిరేకిస్తున్నారు.

పవర్​ హర్ష అనే యువకుడు కేపీహెచ్​బీకాలనీలోని సర్వీస్​ రోడ్డులో జులై 10వ తేది, కూకట్​పల్లి మెట్రో స్టేషన్​ వద్ద ఈ నెల 12వ తేదిన డబ్బులు గాలిలో విసురుతు వీడియోలు తీసుకుని తన ఇన్​స్టా అకౌంట్​లో అప్లోడ్​ చేశాడు. ఇందులో ఒక పోస్ట్​కు 3,335, మరో పోస్ట్​కు 1,90,338 లైక్​లు వచ్చాయి. లైకులు, ఫాలోవర్​లను పెంచుకునేందుకు యువకులు చేస్తున్న చేష్టలు సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. రోడ్డుపై డబ్బులు విసిరినప్పుడు డబ్బుల కోసం జనం ఎగబడటంతో వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు. ఇదిలా ఉండగా వీడియోల ఆధారంగా సదరు యువకుడిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూకట్​పల్లి డివిజన్​ ఏసీపీ శ్రీనివాస్​ రావు తెలిపారు. ఇదిలా ఉండగా హర్ష పర్వత్​నగర్​లో నివాసం ఉంటున్నట్టు సమాచారం.


Similar News