టికెట్ సరే.. మద్దతు కూడగట్టడమే కీలకం

నిన్నటి వరకు వినిపించిన ఊహాగానాలకు తెరపడింది. సోషల్ మీడియా వేదికగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగిన వాదోపవాదాలకు స్వస్తిపడింది.

Update: 2023-08-21 17:51 GMT

దిశ, పేట్ బషీరాబాద్: నిన్నటి వరకు వినిపించిన ఊహాగానాలకు తెరపడింది. సోషల్ మీడియా వేదికగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో జరిగిన వాదోపవాదాలకు స్వస్తిపడింది. పార్టీ అధినాయకత్వం మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తూ, మొదటి లిస్టులోనే పేరును ప్రకటించడంతో ఎవరికి టికెట్ వస్తుంది అన్న చర్చలకు ముగింపు పడినప్పటికీ, నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణుల అందరి మద్దతు కూడగట్టుకోవటమే ఇప్పుడు ఎమ్మెల్యే వివేకానంద ముందు ఉన్న పెద్ద సవాల్.

జంట సర్కిళ్ల కార్పొరేటర్ల మద్దతు ఎవరికి..?

చాలా రోజులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుల మధ్య దూరం పెరిగింది. దీంతో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ముఖ్య అనుచరులుగా ఉండే సుభాష్ నగర్ కార్పొరేటర్ హేమలత భర్త సురేష్ రెడ్డి, చింతల్ కార్పొరేటర్ రషీదా బేగం భర్త మహమ్మద్ రఫీ, జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్, గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ లు సైతం ఎమ్మెల్యేకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సైతం వారు హాజరు కానీ సందర్భాలు ఉన్నాయి.

కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యే ఒకసారి స్థానిక కార్పొరేటర్ లో ఒకసారి కార్యక్రమాలను ప్రారంభించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలలో సుభాష్ నగర్ కార్పొరేటర్ 19వేల 595, సూరారం కార్పొరేటర్ 11వేల115, చింతల్ కార్పొరేటర్ 8వేల477, జగద్గిరిగుట్ట కార్పొరేటర్ 10,382, గాజులరామారం కార్పొరేటర్ 13,267 ఓట్లు సాధించటంతో పాటుగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి జీడిమెట్ల కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి 9 వేల 198 ఓట్లు సాధించారు.

ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేటర్ల అనుచరులు, అభిమానుల నుంచి వచ్చే ఒక్కో ఓటు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సందర్భంలో పార్టీ నాయకత్వం కుబ్బులాపూర్ ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు మూడవసారి వివేకానందకు అవకాశం కల్పిస్తూ ప్రకటన చేయడంతో ఇప్పుడు వారి మద్దతు ఎమ్మెల్యేకి ఉంటుందా లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

సొంత బాబాయి తో విభేదాలు దూరమవుతాయా..?

అదేవిధంగా ఎమ్మెల్యే వివేకానంద సొంత బాబాయ్ కేఎం ప్రతాప్ తో కూడా గత కార్పొరేట్ ఎలక్షన్ అనంతరం క్రమక్రమంగా దూరంగా వస్తూ ఉన్నారు. ఇదే సమయంలో బాబాయి కొడుకు కేపీ విశాల్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పార్టీలోకి మారుతున్నట్లు మీడియా ముఖంగా ప్రకటన కూడా చేశారు. ఇటీవల చేపట్టిన పార్టీ కార్యక్రమాలలో కేఎం ప్రతాప్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజులు కలిసి కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇదే నెలలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను తీవ్రంగా విమర్శిస్తూ కేపీ విశాల్ మీడియా ముందుకు వచ్చారు. ఇలాంటి సందర్భంలో త్వరలో వచ్చే ఎన్నికలలో వీరి మద్దతు ఎమ్మెల్యే వివేకానందకు ఉంటుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. పార్టీ ప్రకటనతో వీరి మధ్య విభేదాలు దూరమవుతాయా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

గత ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా..

2018 అసెంబ్లీ ఎన్నికలలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కే పి వివేకానందకు మద్దతుగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుతో పాటుగా, కార్పొరేటర్లు, క్రింది స్థాయి నాయకులు కలిసికట్టుగా పనిచేసే ఆయన గెలుపుకు శ్రమించారు. ఎమ్మెల్యే తండ్రి కేయంపాండు ఎన్నికల ప్రచార సమయంలో చనిపోగా ఆ సమయంలో ఎమ్మెల్యే బయటకు రాలేని పరిస్థితిలో కూడా వీరందరూ ముందు ఉండి ఎన్నికల ప్రచారం చేసి పూర్తిగా సహకరించారు.

Tags:    

Similar News