డ్రైనేజ్ లైన్ సమస్య పై పట్టింపేది..?

డ్రైనేజీ లైన్ ఆధునీకరణ పేరుతో పనులు చేపట్టారు. తవ్వేసిన

Update: 2024-10-15 13:07 GMT

దిశ,పేట్ బషీరాబాద్: డ్రైనేజీ లైన్ ఆధునీకరణ పేరుతో పనులు చేపట్టారు. తవ్వేసిన అనంతరం నెలలు గడుస్తున్నా నేటికీ పనులు పూర్తిగా లేదు. దీంతో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న మురుగునీరు తమ బ్లాక్ లోకి వచ్చి చేరుతుందని వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని వేడుకుంటూ సూరారం రాజీవ్ గృహకల్ప వాసులు ప్రభుత్వ కార్యాలయల చుట్టూ తిరుగుతున్నారు.

సమస్యను పరిష్కరిస్తామన్నారు.. కొత్త సమస్య తెచ్చారు..

సుభాష్ నగర్ డివిజన్ సూరారం రాజీవ్ గృహకల్ప లో ఎన్నికల సమయంలో డ్రైనేజ్ పనులను ప్రారంభించారు. పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్న ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 94 వద్దకు ఎగువ ప్రాంతంలో ఉన్న 95, 90 ఇతర బ్లాక్ ల నుంచి మురుగునీరు రోడ్డుపైన నిలుస్తుంది. నిలిచిన నీరు బ్లాక్ లోకి చేరుతుంది. డ్రైనేజీ లైన్ వేశారు కానీ కనెక్షన్లు మాత్రం ఇవ్వలేదని, అందుకు కారణం తమకు తెలియదని చెబుతున్నారు అక్కడివారు. మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చిన అధికారులు ఆ సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తీసుకువచ్చారని విమర్శిస్తున్నారు. ప్రతి నాలుగు ఐదు రోజులకు గల్లీలో మురుగునీరు నిండిపోతుందని, శుభ్రం చేయడానికి వచ్చిన వారు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా..

రాజీవ్ గృహకల్ప లో మురుగు నీటి సమస్య పై దానిని పరిష్కరించాలని కోరుతూ అక్కడివారు ప్రజాప్రతినిధులను,అధికారులను వేడుకుంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి దృష్టికి సమస్యను తీసుకువచ్చిన లాభం లేదని వాపోతున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయానికి వచ్చి అధికారులకు సమస్యను వివరించారు. అయితే సర్కిల్ అధికారులు మురుగునీటి వ్యవస్థ పనులను వాటర్ వర్క్స్ వారు చూస్తారని చెప్పడంతో వారు ఐడీపీఎల్ లో ఉన్న వాటర్ వర్క్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మొరపెట్టుకున్నారు. ఈ సమస్యపై రెండు మూడు రోజుల్లో అక్కడికి వచ్చి పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో చేసేదేమీ లేదు వెను తిరిగారు.

బండరాయి అడ్డురాటంతోనే..

ఈ విషయంపై సూరారం సెక్షన్ వాటర్ వర్క్స్ మేనేజర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ పనులు చేస్తున్న సందర్భంలో బండరాయి అడ్డు వచ్చిందని దీంతో ఇబ్బంది తలెత్తిందని పేర్కొన్నారు. అయితే బండరాయి వలన ఇబ్బందిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అనే ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు. పది రోజులు పట్టొచ్చు.. 15 రోజులు పట్టొచ్చు.. చెప్పలేమంటూ చెప్పుకొచ్చారు. డ్రైనేజ్ ని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే దానికి ఆ విషయం తనకు తెలియదని తెలిపారు.

మా సమస్యను పరిష్కరించండి : పద్మ, బ్లాక్ నెంబర్ 94, రాజీవ్ గృహకల్ప

దిగువన ఉన్న మా బ్లాక్ లోకి పైనుంచి మురుగునీరు వస్తుంది. లైన్ వేశారు కానీ కనెక్షన్లు కలపలేదు. డ్రైనేజీ శుభ్రం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వారానికి రెండు సార్లు శుభ్రం చేయించుకోవాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులకు సమస్యను విన్నవించిన వారు పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు వెంటనే మా సమస్యను పరిష్కరించాలి.


Similar News