కమ్మేసిన కాలుష్యం.. ప్రమాదపుటంచున సాయి అనురాగ్ కాలనీ

బాచుపల్లి, సాయి అనురాగ్ కాలనీ కాలుష్య కోరల్లో

Update: 2024-08-23 12:37 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : బాచుపల్లి, సాయి అనురాగ్ కాలనీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. పరిశ్రమ యాజమాన్యం ఇష్టారీతిన నిర్వహణ చేపట్టడమే స్థానికులకు శాపంగా మారింది. పరిశ్రమ వ్యర్ధాలు, పొగతో కాలుష్యాన్ని నింపుతున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, పర్యావరణం కలుషితమవుతోందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ప్రమాదకరంగా పరిశ్రమ వ్యర్ధాలు, పొగ మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలం, సాయి అనురాగ్ కాలనీ సమీపంలో‘‘ టిఎఫ్ ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ’’ పేరిట పరిశ్రమ నడుస్తోంది. అయితే ఈ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను నియంత్రించి,వాటిని తగు విధంగా భద్రం చేయాలి. కాలుష్యం గాలిలో, నేల మీద విడుదల విడుదల చేయకుండా జాగ్రత్తలు పాటించాలి.కానీ ఇక్కడ పరిశ్రమ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

పరిశ్రమకు సంబంధించిన విష కాలుష్యం, విష పదార్థాలు విచ్చలవిడిగా వెదజల్లుతున్నాయి. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు సైతం రోగాల బారిన పడటమే కాకుండా ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. పర్యావరణంలోకి రసాయన కాలుష్యం విడుదల చేస్తున్నారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారబోయడం..కాలువల్లో వదలడం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే పొగ గాలిలోకి కలిసే ముందు దానిని నియంత్రించాలి. వ్యర్థాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి. లేకుంటే పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు,పక్షులు,జంతువులు, పంట పొలాలు విష పూరిత మవుతాయి.ముఖ్యంగా పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా పెద్ద గొట్టాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఫిల్టర్ చేయాలి.

నేరుగా గాలిలోకి వదల కూడదు. కానీ బాచుపల్లి, సాయిఅనురాగ్ కాలనీలో నేరుగా పొగను గాలిలోకి వదిలేస్తున్నారు. దట్టమైన పొగ చుట్టు పక్కల పరిసరాలు కనిపించనంతగా కమ్మేస్తున్నాయి.భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. కొత్తగా ఆ కాలనీకి వెళ్లేవారు పట్టుమని పది నిమిషాలైనా ఉండలేరంటే ఎంత దుర్వాసన వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉపాధి కోసం తప్పనిసరి పనిచేసే కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటునే భయమేస్తుంది. కనీస అససరాలైన కార్మికులకు మాస్క్, హెల్మెట్, గ్లౌజు,బూట్లు అందించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పనిసరిగా ల్యాబ్ టెస్టులు చేయించాలి..

పరిశ్రమలో తప్పనిసరిగా ప్రతి మూడు నెలలకొకసారి పరీక్షలు చేయించి, సంబంధిత అధికారుల నుంచి పరిశీలనలో ఎటువంటి అభ్యంతరం లేదని ధ్రువ పత్రాలు జారీ అయితే కానీ పరిశ్రమలను నిర్వహించరాదు. అయితే ‘‘టిఎఫ్ ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’’ కంపెనీ అలాంటి అనుమతులు పొందడం లేదని తెలుస్తోంది.పొంది ఉంటే సంబంధిత ల్యాబ్ ల నుంచి ధ్రువ పత్రాలు పొందాల్సి ఉంటుంది. అటువంటి సర్టిఫికెట్లు ఈ పరిశ్రమలోనూ లేవని సమాచారం . పరిశ్రమ తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు,కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ ఛార్జ్ కొలాన్ హన్మంతరెడ్డి ,భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిలతో సహా,కాలనీవాసులు హన్మంతరావు, కె.నారాయణ గౌడ్, ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖ సైతం కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక మున్సిపల్ యంత్రాంగానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి ఏడాది కాలంగా టీఎఫ్ఎల్ క్విన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమాణాలు పాటించాలని మూడు సార్లు హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. అయినా పీసీబీ అదేశాలను సైతం కంపెనీ బేఖాతరు చేస్తుంది. ఇప్పటికి విచ్చల విడిగా గాలిలో కాలుష్యాన్ని పంపుతోంది. దీంతో పరిసర ప్రాంతాలు విషపూరిత మవుతున్నాయి.

కొరవడిన నియంత్రణ..

టిఎఫ్ఎల్ క్విన్ ఇండియా కంపెనీ విష కాలుష్యం వేదజల్లు తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్న.. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్యామ్యాలకు అలవాటు పడి చేతులు తడుముకుని వెళ్లుపోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పొలుష్యన్ కంట్రోల్ బోర్డు నోటీసులతో సరిపెట్టకుండా.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమలు, కార్మిక ,మున్సిపల్ శాఖల అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి ఎప్పటికప్పుడు కట్టడి చేపడితే కాలుష్యం నియంత్రించవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ సంబంధిత అధికారులు అటుగా వెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

ప్రాణాలను హరిస్తుంది..: హన్మంతరావు, సాయి అనురాగ్ కాలనీ వాసి

టిఎఫ్ ఎల్ క్వీన్ ఇండియా సంస్థ పరిశ్రమల చట్టాలను ఉల్లంఘిస్తోంది. విచ్చల విడిగా గాలిలో కాలుష్యాన్ని వెదజల్లుతోంది. పరిశ్రమ నుంచి సాయి అనురాగ్ కాలనీ మీదుగా వెళ్లే మురుగు కాల్వలో పరిశ్రమ వ్యర్థాలను వదులుతున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లుతోంది. తద్వారా కాలనీవాసులు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు.కొత్తవారు కాలనీకి వస్తే పరిశ్రమ నుంచి వస్తున్న దుర్వాసన, పొగ తో వేగలేకపోతున్నారు.


Similar News