చోరీ కేసును చాకచక్యంగా చేధించిన పోలీసులు..

పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలి పై హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన కేసును శామీర్ పేట పోలీసులు చేధించారు.

Update: 2024-09-28 16:56 GMT

దిశ, శామీర్ పేట : పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలి పై హత్యాయత్నం, దోపిడీకి పాల్పడిన కేసును శామీర్ పేట పోలీసులు చేధించారు. నిందితులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు సెల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ గ్రామంలో పుట్టినరోజు వేడుకల పేరుతో వృద్ధురాలి పై హత్యాయత్నం దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని బంగారం, వెండి ఆభరణాలతో పాటు సెల్ ఫోన్లు, బైకులు స్వాధీనం చేసుకొన్న ఘటనలో బాధితులైన వారిని కటకటాలకు తరలించారు. ఫలకనుమా ప్రాంతానికి చెందిన వనరాసి నరసింహ, భార్య లక్ష్మి వీరికి ముగ్గురు కూతుళ్లు కొడుకు ఉన్నారు. దేశదిమ్మరులుగా సంచారం చేస్తూ యాసిడ్ ఫినాయిల్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా నమ్మిన వారిని దోచుకోవడం ప్రవృత్తిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18వ తేదీన జగన్ గూడ గ్రామానికి వచ్చి తమకు కిరాయికి ఇల్లు కావాలని చెవ్వ రాములమ్మలను అడిగారు. ఆమె తమ ఇంటి ముందున్న బంగారు స్వామి ఇంటిని కిరాయికి ఇప్పించింది.

దీంతో ఆమెను నమ్మించిన నిందితులు ఈ నెల 23న తమ పిల్లల పుట్టిన రోజు వేడుక పేరుతో ఇంటికి పిలిచారు. మద్యం తాగించిన వెంటనే ఆమెపై దాడి హత్యాయత్నానికి ప్రయత్నించారు. వృద్ధురాలు స్పృహ తప్పడంతో ఆమె ఒంటి పైన ఉన్న ఏడుతులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలతో పరారు అయ్యారు. మేలుకున్న వృద్ధురాలు అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనాథ్, డీఐజీ గంగాధర్ లు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ జరిగిన ఐదు రోజుల్లోనే నిందితులను పట్టుకొని కటకటాలోకి నెట్టారు. కాగా ఈ నిందితులు ఇప్పటికే మహబూబ్ నగర్, మెదక్ తదితర ప్రాంతాల్లో మొత్తం నాలుగు దొంగతనాలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు మూడు సెల్ ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరాలు వెల్లడించారు. నిందితుల పిల్లలను పోలీసుల పర్యవేక్షణలో శరణాలయంలో చేర్పిస్తామన్నారు. ప్రజలు అపరిచితులను నమ్మరాదని కొత్త వారు ఎవరైనా సహాయం కోసం వచ్చినా ఇంటి పరిసరాలు సంచరించిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కొత్త వ్యక్తులను నమ్మి కష్టాలు తెచ్చుకోవద్దని సూచించారు. కేసు చేదించడంలో చురుగ్గా పాల్గొన్న అధికారులు సిబ్బందిని ప్రశంసించినారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీర్బాగ్ ఏసీబీ రాములు సీఐ శ్రీనాథ్, డీఏ గంగాధర్, ఎస్సైలు, ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News