కేర్​టేకర్​గా ఉండి నగలతో ఉడాయించిన వ్యక్తి రిమాండ్..

అనారోగ్యంతో మంచాన పడ్డ వ్యక్తికి కేర్​టేకర్​గా చేరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన ఓ ఘరాన దొంగను కూకట్​పల్లి, బాలానగర్​ సీసీఎస్​ పోలీసులు శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

Update: 2023-04-15 17:36 GMT

దిశ, కూకట్​పల్లి: అనారోగ్యంతో మంచాన పడ్డ వ్యక్తికి కేర్​టేకర్​గా చేరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన ఓ ఘరాన దొంగను కూకట్​పల్లి, బాలానగర్​ సీసీఎస్​ పోలీసులు శనివారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, సీఐ నరసింగరావు​ తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానందనగర్​ కాలనీకి చెందిన కొత్తకోట శైలజ(60), తన భర్త అనారోగ్యంతో మంచాన పడటంతో బోడుప్పల్ లోని అన్నపూర్ణ హోం కేర్​ సర్వీసెస్​ నుంచి ఖమ్మం కొత్తగూడెంకు చెందిన బంటి చంటి కుమార్​ అలియాస్​ రాకేష్​, అలియాస్​ దేవిడ్​(26)ను కేర్​ టేకర్​గా విధులలో చేర్చుకున్నారు.

ఇదిలా ఉండగా హనుమాన్​ జయంతి రోజున కొత్తకోట శైలజ స్థానికంగా ఉన్న యోగా క్లాస్​కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన బంటి చంటి కుమార్​ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రెడ్​మీ మొబైల్​ ఫోన్​లు సుమారు రూ. 7 లక్షల విలువ చేసే వస్తువులతో ఉడాయించాడు. కొత్తకోట శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన కూకట్​పల్లి పోలీసులు బంటి చంటి నేర చరిత్రను చూసి ఆశ్చర్య పోయారు. బంటి చంటిపై గతంలో రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని చైతన్యపురి, మీర్​పేట్​, బాలాపూర్​, సరూర్​ నగర్​, హిమాయత్​నగర్, వనస్థలిపురం​ పోలీస్​స్టేషన్​లతో పాటు సైదాబాద్​ పోలీస్​ స్టేషన్​లలో మొత్తం 33 చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నట్టు ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ చంద్రశేఖర్​ మాట్లాడుతూ కేర్​టేకర్​లను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఇండ్ల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు, అపార్టుమెంట్లలలో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని ప్రజలకు సూచించారు. కేసును ఛేదించిన కూకట్​పల్లి డీఐ ఆంజనేయులు, డీఎస్సై రజాఖ్​, బాలానగర్​ సీసీ పోలీసులను అభినందించారు.

Tags:    

Similar News