ఆహ్లాదాన్ని పంచే పార్క్ అధ్వానంగా..

ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పార్క్

Update: 2024-09-24 12:32 GMT

దిశ, కూకట్​పల్లి: ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పార్క్ కాస్త అనారోగ్యాలను పంచే ప్రాంతంగా మారింది. హెచ్​ఎండిఏ, జీహెచ్ఎంసీ విభాగాల మధ్య సమన్వయ లోపం తో రంగధాముని లేక్​ ఫ్రంట్​ పార్క్ అధ్వాన్నంగా తయారైంది. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా హెచ్​ఎండీఏ ఆధ్వర్యంలో 9.80 కోట్లతో రంగధాముని చెరువు లేక్​ ఫ్రంట్​ పార్క్, 19.30 కోట్ల వ్యయంతో చెరువు కట్ట సుందరీకరణ పనులు మొత్తం సుమారు 29.1 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టి 2023 అక్టోబర్​ 5వ తేదిన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సి నవీన్​ కుమార్​ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా హెచ్​ఎండిఏ, జీహెచ్​ఎంసీల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్క్ పర్యవేక్షణ కరువైంది, పార్కుల గేటు ఎప్పుడు తాళం వేసి దర్శనమిస్తుంది. పార్క్ లోకి వెళ్లేందుకు వీలు లేక పోవడంతో ప్రజలు గోడ దూకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.

పిచ్చి రాతలు, చెత్త తో నిండి పోయింది..

రంగధాముని లేక్​ ఫ్రంట్​ పార్క్ లో అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం, పార్కులోని గోడలు, శిలాఫలకం నిండ పిచ్చి రాతలు నిండి పోయి దర్శనమిస్తున్నాయి. పార్క్ నిండ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం నిండి ఉంది. అంతే కాకుండా పార్కులో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో యువతి యువకులు, బయటి నుంచి వ్యక్తులు అసభ్యకర స్థితిలో చెట్ల పొదలలో కూర్చుంటుడటం అక్కడి వచ్చే వారిని ఇబ్బందికి గురి చేస్తుంది.

రెండు శాఖల మధ్య సమన్వయ లోపం..

హెచ్​ఎండిఏ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టి పార్కును జీహెచ్ఎంసీకి అప్పగించామని హెచ్​ఎండిఏ ఏఈ సంధ్య తెలుపుతుండగా కేవలం ప్రపోజల్​ మాత్రమే పంపించారు ఇంకా హ్యాండోవర్​ చేసుకోలేదని మూసాపేట్​ సర్కిల్​ ఏఈ శ్రీనివాస్​ తెలుపుతున్నారు. రెండు శాఖల మధ్య ఇప్పటికే కాగితాల మీద లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇప్పటి వరకు పార్క్ నిర్వహణ బాధ్యత ఎవరు చూసుకుంటారో కొలిక్కి రాలేదు. దీంతో పార్కును పట్టించుకునే వారు, పర్యవేక్షించేవారు లేక ప్రారంభించి ఏడాది కాక ముందే పార్కు పూర్తిగా అధ్వానంగా మారింది. హెచ్​ఎండీ అధికారులు పార్క్ పనులు పూర్తిగా చేయలేదు. టాయిలెట్స్​, మిగిలిన సివిల్​ పనులు కొన్ని నిమజ్జనం సందర్భంగా మూసాపేట్​ సర్కిల్​ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఏఈ శ్రీనివాస్​ తెలిపారు.


Similar News