చిట్టీల పేరుతో దంపతుల టోకరా…లబోదిబోమంటున్న బాధితులు
చుట్టుపక్కల వారితో మంచిగా వ్యవహరిస్తూ, చిట్టిలతో అందరూ లబ్ధి పొందవచ్చని నమ్మించారు.
దిశ, పేట్ బషీరాబాద్: చుట్టుపక్కల వారితో మంచిగా వ్యవహరిస్తూ, చిట్టిలతో అందరూ లబ్ధి పొందవచ్చని నమ్మించారు. పదుల సంఖ్యలో బాధితుల వద్ద నుంచి కోట్ల రూపాయల ను చిట్టిల పేరుతో వసూలు చేసి పరారయ్యారు దంపతులు. కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 2 లో మేకల నాగమణి, నాగమయ్యలు భార్యాభర్తలు. నాగమయ్య ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా నాగమణి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ఉండేది. 2006 నుంచి చిట్టీల వ్యాపారం చేస్తూ స్థానికంగా అందరిని నమ్మించింది. నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఆమె వద్ద చిట్టీలు వేయడం ప్రారంభించారు.
లక్ష రూపాయలు మొదలుకొని రూ. 20 లక్షల రూపాయల వరకు చిట్టీలు నిర్వహిస్తూ ఉండేది. ఉన్నట్లుగా నాగమణి దంపతులు ఏప్రిల్ రెండో వారం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో వారి కోసం వాకబు చేసిన ఫలితం లేకపోయినప్పటికి బాధితులు తొలుత జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు ఎక్కువ మొత్తంలో ఉండటంతోపాటు పోగొట్టుకునే డబ్బు నాలుగు కోట్లకు పైగా ఉండటంతో ఈ ఓ డబ్ల్యు లో కేసు నమోదయింది. అయితే ఏప్రిల్ 16న కేసు నమోదు అయినప్పటికీ నేటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోతూ బాధితులు గురువారం నిందితుల ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు వేడుకున్నారు.