బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. అభ్యర్థుల జాబితాపై ఆందోళన
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.తొలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. గులాబీ అధినేత మదిలో ఎవరెవరు ఉన్నారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్న
దిశ ప్రతినిధి, మేడ్చల్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.తొలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. గులాబీ అధినేత మదిలో ఎవరెవరు ఉన్నారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలు అంశాలు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు సూచనప్రాయంగా తమకే టికెట్లు ఖరారైనట్లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కానీ ఇప్పటికీ అధికారికంగా జాబితా వెల్లడి కాలేదు. ఈ నెల 21వ తేదీన మొదటి దఫా 50కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు వస్తాయా..? లేక ఏయే స్థానాల్లో మార్పులు ఉంటాయా... అనేది హాట్ టాఫిక్ గా మారింది.
సిట్టింగుల్లో టెన్షన్..
మేడ్చల్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదింటికి ఐదు సీట్లను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసుకుని తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి విజయం సాధించడం బీఆర్ఎస్ కు మింగుడు పడలేదు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, గ్రామ పంచాయితీలను కైవసం చేసుకోని ప్రతి పక్షాలను చావు దెబ్బ కొట్టింది. అయితే తాజా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై అవినితీ అరోపణలు రాగా, మరికొందరిని ప్రచారానికి వెళ్లితే ప్రజలు అడ్డుకుంటున్నారు. దీంతో మెజారిటీ స్థానాల్లో పాత వారికే మళ్లీ టికెట్లు ఇస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.... ఎక్కడైనా ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోని, సర్వేలో గ్రాఫ్ పడిపోవడం, ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రత్యర్థి కంటే వెనుకబడి పోవడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తామని హెచ్చరించిన విషయం విధితమే. దీంతో జిల్లాలోనూ రెండు,మూడు స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కడెక్కడ మార్పు..
మేడ్చల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాత వారికే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతున్నాయి. వీటిలో కూకట్ పల్లి, మల్కాజిగిరి తోపాటు మేడ్చల్ లోనూ పాత వారికి ఢోకా లేనట్లు ప్రచారం జరుగుతోంది. కూకట్ పల్లి, మల్కాజిగిరిలలో పార్టీలో అసమ్మతి లేకపోవడంతో మాధవరం క్రిష్ణారావు, మైనంపల్లి హన్మంతరావులకే తొలి జాబితాలో టికెట్లు దక్కనున్నట్లు సమాచారం ఉంది. అయితే మంత్రి మల్లారెడ్డికి స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, రెండోసారి మేడ్చల్ నుంచి మల్లారెడ్డినే బరిలో దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మిగితా కుత్బుల్లాపూర్, ఉప్పల్ లలో పార్టీలో అసమ్మతి వల్ల టికెట్ల కేటాయింపు ఊగిసలాట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్సీ,ప్రభుత్వ విఫ్ శంభీపూర్ రాజు టికెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారు.కుత్బుల్లాపూర్ లో అభ్యర్థిని మార్చకపోతే పార్టీ విజయం కష్టమని పలు సర్వేల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉప్పల్ సెగ్మెంట్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ సీనియర్ నేత బంఢారి లక్ష్మారెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కాదని తమలో ఎవరికి ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో మార్పులు ఉంటాయా..? కొత్తవారికి అవకాశాలు ఉంటాయా..? అనేది తేలాల్చి ఉంది.