సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక..
తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సాహితీ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, చెరబండ రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సాహిత్యదినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారుల భాగస్వామ్యం ఎంతో ఉందని, ఈ విషయంలో వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తూ వారిని గౌరవిస్తోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవులు రాసిన పాటలు, వారు పాడిన పంటలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాయని వారిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వరాష్ట్రంలో మన సాహిత్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ తేజోమూర్తుల పేరుమీద పురస్కారాలను అందచేస్తందని తెలిపారు.
సాహితీ దినోత్సవాన్ని జిల్లాలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, కవుల కవితా సంపదతో విరాజిల్లుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం పోరాటాల గడ్డ అని... సాహితీరంగంలో వారు తమదైన ముద్ర వేసి మొదట కావ్యం, మొదటి కవి అందరూ మన తెలంగాణవాదులేనన్నారు. అలాగే బూర్గుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వతహాగా కవులు కావడం మన అదృష్టమన్నారు. తెలంగాణ సాహితీ దినోత్సవం సందర్భంగా కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కవులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు, పారితోషికాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బలరామారావు, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, కలెక్టరేట్ ఏ ఓ వెంకటేశ్వర్లు, షామీర్పేట ఎంపీపీ దాసరి ఎల్లు బాయి , షామీర్పేట జడ్పిటిసి అనిత, మేడ్చల్ జడ్పిటిసి శైలజ రెడ్డి మున్సిపల్ గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రెడ్డి ,ఘట్కేసర్ మున్సిపల్ చైర్మన్ పావని తదితరులు పాల్గొన్నారు.