వరదల నష్టనివారణ చేపట్టండి
వరదల వల్ల చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : వరదల వల్ల చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను, బ్రిడ్జిలను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు వరద సహాయక కేంద్రాలలో అన్ని వసతులతో పాటు, భోజన సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు. నీటమునిగిన ఇళ్ల బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
వరద తగ్గుముఖం పట్టిన వెంటనే నష్టపోయిన పంటపొలాలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు. వరద వల్ల పూర్తిగా నష్టపోయిన పొలాలు, వరదనీరు నిలవడం వల్ల మునిగి నష్టపోయిన పొలాలను అంచనా వేయాలని కోరారు. కోతకు గురైన పొలాలను సరిచేయడానికి ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించాలని, పశువులు, గొర్రెలు, మత్స్యసంపద నష్టాలను అంచనా వేసి వారికి కూడా నష్టపరిహారం అందించాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, సరిపోయేంత మందులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.