మిగులు భూములు.. హాంఫట్

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లో కోట్ల రూపాయల విలువైన మిగులు భూములు కబ్జాకు గురవుతున్నాయి..

Update: 2024-09-28 02:40 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అల్వాల్‌లోని జొన్నబండలో గల కోట్ల రూపాయల విలువైన మిగులు (యూఎల్సీ) భూములు కబ్జాకు గురవుతున్నాయి. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం పేదలకు మాత్రమే నోటిసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

రూ.350 కోట్ల భూమిపై కన్ను..

అల్వాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 582, 583లో దాదాపు 27ఎకరాల మిగులు (యూఎల్‌సీ) భూములు ఉన్నాయి. ఈ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.350కోట్లకు పైగా ఉందని అంచనా. కాగా ఈ ప్రాంతం జొన్న బండగా ప్రసిద్ధి. ఇక్కడ పెద్ద బండలు ఉన్నందున కొందరు రాళ్లు కొట్టుకొని జీవనం సాగించేవారు. వారు నాలుగైదు ఎకరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే దాదాపు 20 ఎకరాల ఖాళీ యూఎల్‌సీ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. అడ్డంగా అక్రమించిన మిగులు భూములను ప్లాట్లుగా విక్రయించి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలను గడిస్తున్నారు. రాత్రికి రాత్రే రాళ్లు కొట్టిన గుంతలను మట్టితో నింపుతున్నారు. బ్లూ రేకుల షీట్లతో హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసి యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గత కొన్ని నెలలుగా అక్రమంగా అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఓ ప్రముఖ స్కూల్ యాజమాన్యం యూఎల్ సీ స్థలాన్ని అక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నోటీసులు కొందరికేనా..?

హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. యూఎల్‌సీ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే నోటీసులు పేద, మధ్య తరగతి కుటుంబాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో మిగులు భూములను ఆక్రమించి అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలను నడుపుతున్న యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు రాత్రి రాత్రే కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాదారులకు అధికార యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు భూ కబ్జాదారులతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీంతో భూ కబ్జాదారులు ఎలాంటి జంకు, భయం లేకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అనుకొని ఉన్న అల్వాల్‌లో రూ.350 కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా స్పందించి రూ. కోట్ల విలువైన మిగులు భూములను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News