సుమాల్ చెరువు మాయం

చెరువు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.

Update: 2024-10-13 13:08 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : చెరువు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. అయినా చెరువు అన్యాక్రాంతమవుతుంది. చెరువుని కబళిస్తున్నారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పేపర్లకే పరిమితమైంది. కోర్టు బూచి చూపి ఒకరు యథావిధిగా పనులు చేసుకుంటుండగానే మరోవైపు చెరువు ఆక్రమణ ముమ్మరంగా జరుగుతుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం, మేడ్చల్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సుమాల్ (తోమర్) చెరువు పరిస్థితి ఇది.

మూడు గ్రామాల రెవెన్యూ పరిధిలో..

ఇరిగేషన్, హెచ్ఎండీఏ రికార్డుల ప్రకారం 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుమాల్ చెరువు దుండిగల్ గండి మైసమ్మ మండలం పరిధి దూలపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబరు 1, 2 లో ఉంది. మరికొంత మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 388, 523, 524, 534, 535, 536, 537 లలో అదేవిధంగా ఖాజాగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 29 లో విస్తరించి ఉంది.

     సర్వే నెంబర్ 29, 537, 536, 535 లలో చెరువు సింహభాగం ఉండగా ఇతర సర్వే నెంబర్ల పరిధిలో ఎఫ్టీఎల్ తో పాటుగా బఫర్ జోన్ ప్రాంతాలు కలిగి ఉంది. రికార్డుల ప్రకారం ఈ చెరువు సుమాల్ చెరువు, సుమర్ చెరువు (భాంధ చెరువు) అని ఉండగా స్థానికంగా ఈ చెరువును తోమర్ చెరువుగా పిలుస్తారు. ఇప్పుడు ఈ చెరువులో ఎకరాల కొద్ది భూమి అన్యాక్రాంతం అవుతుంది.

భూముల విలువ పెరిగిపోవడంతో…

రికార్డుల ప్రకారం ఈ చెరువు విస్తీర్ణం 44 ఎకరాలు విస్తరించి ఉన్నప్పటికీ సర్వే చేసే సమయం (2014)లో కేవలం 6 ఎకరాల విస్తీర్ణంలోనే నీళ్లు ఉన్నాయి. దిగువ ప్రాంతంలో అప్పట్లో కొందరు వ్యవసాయం చేసుకునేవారు. వీరిలో కొంతమందికి పట్టా, పాస్ బుక్ లు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో భూముల విలువలు పెరిగిపోవడంతో ఇప్పుడు తమకు పట్టాలు ఉన్నాయంటూ చెరువు భూమిలో నిర్మాణాల కోసం చెరువును పూడ్చివేస్తున్నారు. ప్రస్తుతం చెరువు ఎగువ ప్రాంతంలో నిర్మాణాలకు వెళ్లడంతో అక్కడి నుంచి నీరు చెరువులోకి కలుస్తుంది. ప్రస్తుతం చెరువు నిండు కుండలా నీటితో కళకళలాడుతుంది.

పట్టాలు ఉన్నాయంటూ..

చెరువు భూమిలో కొందరికి పట్టాలు ఉండటంతో వారు ఆయా భూములలో చెరువు నీళ్లు ఉన్నప్పటికీ మట్టి నింపి కబ్జా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ రియల్ రోడ్డు వైపు ఉన్న చెరువు భూభాగం సర్వే నెంబర్ 537, 536 లలో కొందరు మట్టి పోసి చదును చేశారు. ఈ విషయంపై గతంలో ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇదే క్రమంలో సర్వే నెంబర్ 537, 535, 534 లలో మరికొందరు పెద్ద మొత్తంలో మట్టిని, బండరాళ్లను చెరువు నీళ్లల్లో వేస్తూ పూడ్చివేత పనులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.

అధికారుల ఊదాసీనతతోనే..

కొంపల్లి మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధితో పాటుగా మూడు గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న సుమాల్ చెరువు పెద్ద మొత్తంలో పూడ్చి వేతకు గురవుతుంది అంటే దానికి ప్రధాన కారణం సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖలకు చెందిన అధికారుల ఊదాసీనతనే అనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు చెరువు భూమిలో చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నెంబర్లను కేటాయిస్తూ ఉండగా, పూడ్చి వేత పనులను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నామ్ కే వాస్తే గా చర్యలు తీసుకుంటున్నారంటూ, అందుకే చెరువు కబ్జాకు గురవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

Tags:    

Similar News