ఆదుకోవాలంటూ అక్కా చెల్లెళ్ల ట్వీట్.. స్పందించిన మంత్రి కేటీఆర్

జెనటిక్ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు యువతులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు.

Update: 2022-12-04 13:38 GMT

దిశ, మేడిపల్లి: జెనటిక్ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు యువతులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆయన ఆదేశాలతో ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి బాధితులను పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు. పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నారెడ్డి నగర్ కు చెందిన వెంకటయ్య, శకుంతలకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. ఆడబిడ్డలు పుట్టారని తంపతులు ఏనాడు దిగులు చెందలేదు. కూతుళ్లను మహరాణుల్లా చూసుకోవాలని ఆ తండ్రి కలలు కన్నాడు. ఈ క్రమంలోనే కష్టపడుతూ వారికి విద్యా బుద్ధులు నేర్పించాడు. అయితే ముగ్గురు కూతుళ్లు ఒకరి తర్వాత ఒకరు అంగవైకల్యుగా మారారు. దీంతో ఆ దంపతులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అప్పటి వరకు తమ పిల్లలు కళ్లముందే నిత్యం చలాకీగా తిరిగిన కూతుళ్ల పరిస్థితిని చూసి తల్లడిల్లారు.

ఉన్నదంతా అమ్మి వాళ్లకు వైద్యం అందించారు. అయినా ఫలితం దక్కకపోవడంతో ఆ దంపతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. పైగా అప్పులు వారిని బాగా కుంగదీశాయి. పోషణ కూడా భారంగా మారింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. తన తరఫున ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని బాధితుల ఇంటికి పంపారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని జెనెటిక్ వైద్యురాలితో సహా పరామర్శించిన మేయర్ వెంకట్ రెడ్డి.. తక్షణ సాయం కింద వారికి రూ.లక్ష అందజేశారు. ముగ్గురికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, కుటుంబంలో ఒకరికి జాబ్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News