అడ్డగోలుగా లాగేసి.. అనుమతులు ఇచ్చేసి..

అడుగడుగునా అక్రమాలు.. ప్రభుత్వ భూముల ఆక్రమణ.. యధేచ్చగా నిర్మాణాలు..ఆ కట్టడాలకు అనుమతులు.. దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు అల్వాల్ జొన్న బండలోని రూ. కోట్ల విలువైన సర్కారీ స్థలం కబ్జా విషయంలో తవ్వేకొద్ది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2024-09-29 15:01 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : అడుగడుగునా అక్రమాలు.. ప్రభుత్వ భూముల ఆక్రమణ.. యధేచ్చగా నిర్మాణాలు..ఆ కట్టడాలకు అనుమతులు.. దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు అల్వాల్ జొన్న బండలోని రూ. కోట్ల విలువైన సర్కారీ స్థలం కబ్జా విషయంలో తవ్వేకొద్ది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెవెన్యూ, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్ అధికారులు ప్రభుత్వ స్థలంలో భవనాలకు అనుమతులిచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్నప్పటికి సబ్ రిజిస్ట్రార్లు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ లు చేశారు. దీంతో ప్రజాప్రయోజనాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ స్థలంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మూడు శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమా..? లేక ఇంకేదైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా..? దీని వెనుక ఎవరి హస్తం ఉందన్నది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.

అడ్డగోలుగా లాగేసి…

మేడ్చల్ జిల్లా, అల్వాల్ సర్వే నెంబర్లు 582, 583 లలో 28.01 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు భూ కబ్జాదారులు తప్పుడు పత్రాలు సృష్టించారు. అక్రమ లే అవుట్ వేసి ప్లాట్లను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూములకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కాసుల కక్కుర్తితో భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. దీంతో అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్థుల భవనాలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ తామేమీ తక్కువ కాదన్నట్లు నిషేధిత జాబితో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఒక్కో ఫైల్ కు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నట్లు కొనుగోలు దారులే చెబుతున్నారు. ఇలా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అల్వాల్ ప్రభుత్వ భూమి కబ్జాకు రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలు వత్తాసు పలుకుతున్నాయి.

కోర్టు ఆదేశాలు బేఖాతరు..

ప్రభుత్వ భూమి ఆక్రమణల పై విచారణ చేపట్టాలని మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణలో అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది. సర్వేనెంబర్ 582, 583లలోని 28.1 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా. అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది కె.విజయ్ కుమార్ 2020లో హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కాగా విచారణకు పిటిషనర్ హాజరు కాకపోవడం.. ప్రైవేటు వ్యక్తి ఎం.జనార్దన్ తరపు న్యాయవాది ఆ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ, విక్రయ దస్తావేజు తేదీల వివరాలను వెల్లడించలేదు. ప్రత్యేక పరిస్థితులున్న ఈ వ్యవహరంలో పిటిషనర్ తో పాటు భూమి పై హక్కులున్నాయంటున్న వారందరికీ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కు 2023, నవంబరు 3వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. భూమి పై హక్కులకు సంబంధించి తగిన పత్రాలను సమర్పించడానికి తగిన అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆక్రమణదారుల తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తిచేయాలని హై కోర్టు కలెక్టర్ ను ఆదేశించింది.

మొక్కుబడి చర్యలతో..

హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణదారుల పై చర్యలు తీసుకోవడంలో తాత్సరం చేస్తోంది. 2023 నవంబరులో కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే రెవెన్యూ అధికారులు అక్రమదారులకు 2024, మే నెలలో నోటీసులు ఇచ్చారు. అది కూడా 70 ఏళ్ల క్రితం ఆదే భూమిలో రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తూ.. నాలుగైదు ఎకరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 76 కుటుంబాలకే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. మిగతా 20 ఎకరాలకు పైగా కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్న వారికి నోటీసులు ఇవ్వలేదని సమాచారం. దీన్ని భట్టి రూ.350 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భూ కబ్జాదారులను కాపాడుతూ, పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూ కబ్జా వెనుక పొలిటికల్ లీడర్ల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో వారి పై చర్యలకు అధికారులు జంకుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ భూ కబ్జా పై దృష్టి సారించి. ఆక్రమణదారుల నుంచి కాపాడాలని స్థానికులు విజ్ఠప్తి చేస్తున్నారు.

స్థలాన్ని కాపాడాలని ఎమ్మెల్యే ఫిర్యాదు..

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానిక మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గత జూలై 1 వ తేదీన డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు అనుమతులు, రిజిస్ట్రేషన్లు చేసిన అధికారుల పై సమగ్ర విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


Similar News