ఖాళీ స్థలాలపై బడా రియాల్టర్ల కన్ను..
రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లే ఔట్లలో ఖాళీ స్థలాలపై బడా రియాల్టర్ల కన్ను పడింది.
దిశ, ఘట్కేసర్ : రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ లే ఔట్లలో ఖాళీ స్థలాలపై బడా రియాల్టర్ల కన్ను పడింది. 37 ఏళ్ల క్రితం లే అవుట్ చెల్లదని పట్టాదారులతో ఒప్పందాలు కుదుర్చుకొని రూ. కోట్ల విలువైన భూములను కొనుగోలు చేసి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. నాలా కన్వర్షన్ చేసుకొని హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొంది భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అప్పట్లోనే పంచాయతీ లే ఔట్లలో ప్లాట్లు కొన్న వారు లే ఔట్ కు వస్తే బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఓ బాధితుడి ఫిర్యాదుతో రూ. కోట్ల విలువైన పార్కు స్థలం అన్యాక్రాంతమైన విషయం వెలుగులోకి వచ్చింది.
1986లో ఏర్పడిన శ్రీరామ కాలనీ..
నారపల్లిలో సర్వే నెం. 27, 28లో 14 ఎకరాల్లో గ్రామపంచాయతీ లేఔట్‌లో 174 ప్లాట్లు చేసి అంజయ్య, సరాజమ్మ అమ్ముకున్నారు. పంచాయతీ అనుమతులతో అక్కడ కాలనీలో కొందరు ఇండ్లు నిర్మించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు మారకపోవడం, నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు రూ.కోట్లలో పలకడంతో పట్టాదారులకు కలిసొచ్చింది. 37 ఏళ్ల క్రితం తాము చేసిన వెంచర్ లో ఖాళీ స్థలాల్లోని 1.10 ఎకరాల భూమిని ఒక కెమికల్ సంస్థకు అమ్ముకున్నారు. సదరు సంస్థ ప్రణాళిక ప్రకారం నాలా కన్వర్షన్ చేయించుకొని బహుళ అంతస్తుల నిర్మాణాలకు హెచ్ ఎండీఏ నుంచి అనుమతులు తెచ్చుకొని జైన్ కన్ స్ట్రక్చన్ సంస్థకు అపార్ట్‌మెంట్లు నిర్మాణాలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. గ్రామపంచాయతీ లేఔట్‌లో పార్కు స్థలంతో పాటు పక్కనే ఉన్న ప్లాట్లను కూడా కబ్జా చేసి నిర్మాణం చేస్తుండడంతో వివాదం తలెత్తింది. పోచారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెం. 137, 138లో వేంకటేశ్వర నగర్‌లోని పార్క్ స్థలం కబ్జా పై సంఘటితంగా పోరాడి కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేసుకున్నారు. నారపల్లిలో సర్వే నెం. 27, 28 లోని 1.10 ఎకరం పార్కు స్థలాన్ని రియల్టర్లు, కాంట్రాక్టర్లు స్వాధీనం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ..
పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ పదవ వార్డ్ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ మార్చి, 2024లో నారపల్లిలోని శ్రీరామ కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతం విషయం పై అప్పటి మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టాలని హెచ్ఎండీఏ కమిషనర్ కు వేమారెడ్డి జూన్ లో లేఖ రాశారు. కానీ ఇప్పటి వరకు హెచ్ఎండీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా ఓ బడా కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధి సెటిల్మెంట్లకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 20 కోట్ల విలువైన పార్కు భూమిని ఊరికే ఎలా వదులుకుంటాం ఎంతో కొంతైనా ఇవ్వాల్సిందేనని బేరసారాలకు దిగినట్లు సమాచారం.
రెవెన్యూ అధికారులదే పొరపాటు.. పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి
ఏదైనా భూముల్లో లేఔట్ చేసిన తర్వాత ప్లాట్లు అమ్మకాలు జరిగితే రెవెన్యూ రికార్డులు మార్పులు జరగాలి.. కానీ అలాంటివి జరగకపోవడం వల్ల నారపల్లిలో 1.10 ఎకరం స్థలాన్ని ఆర్ఎంకే ఆగ్రో సంస్థ కొనుగోలు చేసి ధరణి రికార్డుల్లో నమోదు చేసుకున్నారని మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి చెప్పారు. సర్వే నెం. 28 లో ఇంటి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లుగా మున్సిపల్ రికార్డుల్లో లేదు. 1986లో చేసిన పంచాయతీ అనథరైజ్డ్ లే ఔట్ అని.. ఆ లేఔట్ లో వదిలేసిన ఖాళీ, పార్కు స్థలాలు మున్సిపాలిటీ గాని, గ్రామపంచాయతీ గాని అప్పగించినట్లు రికార్డుల్లో లేదని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించి హెచ్ఎండీఏ అధికారులకు లేఖ పంపుతామన్నారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. లలిత్ జైన్
అన్ని విధాల డాక్యుమెంట్లు సరిగా చూసుకునే భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాం. అనాథరైజ్డ్ లే అవుట్లలోని ప్లాట్లను ఇటీవల కొనుగోలు చేసి కావాలని కొందరు రాద్ధాంతం చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు.