డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ర్యాగింగ్ భూతం..

ఇప్పటివరకు కళాశాలలో కనిపించిన ర్యాగింగ్ భూతం ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పాకింది.

Update: 2024-09-11 17:16 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : ఇప్పటివరకు కళాశాలలో కనిపించిన ర్యాగింగ్ భూతం ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పాకింది. ఎగువ తరగతి విద్యార్థులు దిగువ తరగతి విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో హేళన చేస్తూ విద్యార్థి పై దాడి చేసి గాయపరచడంతో తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్ల పోచంపల్లిలో ఉన్న డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో బండ్లగూడకు చెందిన తల్లిదండ్రులు వారి కుమారుడిని రెసిడెన్స్ స్కూల్ లో జాయిన్ చేశారు. 8వ తరగతి చదువుతున్న బాలుడు (13) స్కూల్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా పదవ తరగతికి చెందిన పలువురు విద్యార్థులు తరచుగా ఈ బాలుడిని ర్యాగింగ్ చేస్తూ వస్తున్నారు. బ్రేక్ టైం, లంచ్, డిన్నర్ సమయాలలో ర్యాగింగ్ చేస్తూనే విద్యార్థి పై దాడి చేశారు.

మేనేజ్మెంట్ కు ఫిర్యాదు...

తమ కుమారుడి పై ఎగువ తరగతి విద్యార్థులు రాగింగ్ చేస్తు కొడుతున్నారంటూ డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ కు ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. అయినప్పటికీ అటు హాస్టల్, పాఠశాల మేనేజ్మెంట్ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 15న సెలవులు రావడంతో ఇంటికి వచ్చిన బాలుడు తిరిగి 20వ తారీఖున పాఠశాలకు వెళ్లాడు. అప్పుడు బ్రేక్ టైం లో మరో మారు 10వ తరగతి విద్యార్థులు బాధితుడైన బాలుడు వద్దకు వచ్చి మా మీద ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటూ మరోమారు దాడి చేశారు. ఈ క్రమంలో బాలుడి ప్రైవేట్ పార్ట్స్ గాయమయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫోన్ ద్వారా మరో మారు మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులకు తమ బాలుడిని పై తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేసి దాడి చేస్తున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

పాఠశాల ముందు ధర్నా చేసిన తల్లిదండ్రులు..

ర్యాగింగ్ పేరుతో తమ పిల్లవాడిని గాయపరిచిన చర్య పై పాఠశాల యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తల్లిదండ్రులు పాఠశాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. వీరికి మద్దతుగా ఏబీవీపీ వారు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, యాజమాన్యానికి తెలిసిన పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదును స్వీకరించారు.


Similar News