ప్రైవేట్ ఆసుపత్రి సీజ్
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండగా ఓ మహిళ మృతి చెందిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టి ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేస్తుండగా ఓ మహిళ మృతి చెందిన ఫిర్యాదుపై మేడ్చల్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టి ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న శివ హాస్పిటల్ లో గత జూలై 26న బండి సంధ్య అనే మహిళ కు కుటుంబ నియంత్రణ అపరేషన్ చేశారు. వైద్యం వికటించి ఆ మహిళ మృతి చెందింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.రఘురాథ్ స్వామి తన బృందంతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. శివ ఆసుపత్రిలో సీఈఏ చట్టం నిబంధనలకు విరుద్దంగా కనీస వసతులు, వైద్య ప్రమాణాలు లేకుండా పేషంట్లకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనను ఉల్లంఘించిన శివ ఆసుపత్రిని రఘునాథ స్వామి సీజ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సత్యవతి, డాక్టర్ వినోద్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.