అన్ని శాఖల సహకారంతోనే చెరువు కబ్జా..’సుమాల్’కు రక్షణేది..?
చెరువు కబ్జా చకచకా జరిగిపోతుంది.కోర్టు ఆర్డర్ బూచి చూపి కబ్జాదారులు
దిశ, మేడ్చల్ బ్యూరో: చెరువు కబ్జా చకచకా జరిగిపోతుంది.కోర్టు ఆర్డర్ బూచి చూపి కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రోజుకు కొంత మట్టితో చెరువును పూడ్చి వేస్తున్నారు.చెరువు స్థలంలో నిర్మించిన అక్రమ భవనాలకు ఓ శాఖ ఇంటి నెంబర్లను జారీ చేయగా, మరో శాఖ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది.చెరువును కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఇలా కబ్జాదారులకు వత్తాసు పలుకుతుండడంతో మరి కొద్ది రోజుల్లో ‘సుమాల్’ చరిత్ర పుటలోంచి కనుమరుగుకానుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ, మేడ్చల్ రెండు మండలాల పరిధిలో ఉన్న సుమాల్ చెరువు కబ్జాపై ‘దిశ’ ప్రత్యేక కథనం..
శాఖల సంపూర్ణ సహకారం..
సుమాల్ చెరువు మేడ్చల్, గండి మైసమ్మ రెండు మండలాల పరిధిలో 44 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.ఈ చెరువులో ఇటు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలు వెలువగా, దూలపల్లి గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ ఒకటి, రెండు లో కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపట్టారు. ఇకపోతే మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 537 లో వెలసిన అక్రమ నిర్మాణాలకు గాను గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధికారులు ఇంటి నెంబర్లను జారీ చేశారు. 8 ఎకరాల 29 గుంటల స్థలంలో నిర్మాణాలు ఉన్నట్లుగా చెబుతూ రెండు ఇంటి నెంబర్లను అధికారులు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.ఇంటి నెంబర్లు జారీ చేసినందుకు కొన్ని నిర్మాణాలకు రూ. 10, 632 చొప్పున, మరి కొన్ని నిర్మాణాలకు రూ. 10 ,442 ల చొప్పున నాన్ రెసిడెన్షియల్ ఆస్తి పన్నును విధించారు. చెరువు భూమిలో నిర్మాణం చేస్తున్న సందర్భంలో చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండటం, ఇరిగేషన్ అధికారులు సైతం పూర్తిగా సహకరించటంతోనే చెరువు స్థలంలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
తూతూ మంత్రం చర్యలు..
చెరువు విస్తరించి ఉన్న సర్వే నెంబర్ 537 లో ఎఫ్ టీఎల్ భూమిని పూడ్చి వేస్తున్నారంటూ సరిగ్గా సంవత్సరం క్రితం ఇరిగేషన్ అధికారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు.చెరువు కబ్జాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ పట్టనట్లు వ్యవహారించరన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఫిర్యాదు చేసే సమయానికి చెరువులో సింహభాగం మట్టి, బండరాళ్లతో నింపివేశారు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న ఈ చెరువు భూమిలో ఇంత పెద్ద మొత్తంలో పూడ్చివేత పనులు జరుగుతుంటే ఇరిగేషన్ అధికారుల దృష్టికి రాకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కేవలం తమపై ఎటువంటి అభియోగాలు రాకూడదని ఉద్దేశంతోనే పేరుకే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి మామ అనిపించారనే అనుమానాలు ఇరిగేషన్ శాఖపైన వినిపిస్తున్నాయి.
కోర్టు బూచితో కబ్జా..
సుమాల్ చెరువును నాట్ టు ఇంటర్ ఫియర్ కోర్టు ఆర్డర్ బూచిగా చూపి యథేచ్చగా అక్రమణదారులు కబ్జా చేసేస్తున్నారు. మేడ్చల్ రెవెన్యూ అధికారులు గత సంవత్సర కాలంగా కబ్జాదారుల అర్డర్ ను సవాల్ చేస్తూ కోర్టును అశ్రయిస్తామని కాలయాపన చేస్తున్నారు..గత ఏడాది ఆగస్టు 18వ తారీఖున భూ కబ్జా దారుడు తెచ్చిన కోర్టు స్టే ను పేర్కొంటూ అధికారులు అటువైపు వెళ్లడం మానేశారు. అయితే కోర్టు ఉత్తర్వులలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు అని పేర్కొంటూనే చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పినప్పటికీ యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.కోర్టు ఆర్డర్ ను చెరువును కబ్జా చేస్తున్న.. అధికారులు ఎవరు జోక్యం చేసుకోకపోవడం తో పెద్ద మొత్తంలో చెరువు పూడ్చివేయడం జరిగిపోయింది. 2014లో ఇరిగేషన్ అధికారులు హెచ్ఎండిఏ అధికారులు సంయుక్తంగా రూపొందించిన కోఆర్డినేషన్ లెక్కల ప్రకారం ఏ 14 నుంచి ఏ 22 వరకు 8 ఎకరాల వరకు చెరువు భూమిని మట్టి బండరాళ్లతో నింపి పూడ్చి వేశారు.
తాజాగా మరో వైపు పూడ్చివేత..
గుండ్ల పోచంపల్లి యాపిరియల్ పార్కు రోడ్డులో కోఆర్డినేషన్స్ ఏ 60, ఏ 59, 58, 57, 56, 55 ప్రాంతంలో పెద్ద మొత్తంలో మట్టి, బండరాళ్లను వేసి చెరువును పూడ్చి వేస్తున్నారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ చెరువు కబ్జా శరవేగంగా జరుగుతుంటే అధికార యంత్రాంగం లో ఏ ఒక్క శాఖ అధికారి కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికార యంత్రాంగం ఇలాగే చూసి చూడనట్లు మరికొద్ది రోజులు వ్యవహరిస్తే.. సుమాల్ చెరువు చరిత్ర పుటలోంచి కనుమరుగు కావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సుమాల్ చెరువు కబ్జాను అడ్డుకోని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.