మల్కాజిగిరి ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు: ఈటల
మల్కాజిగిరి ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని
దిశ,కూకట్పల్లి : మల్కాజిగిరి ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఈటల రాజేందర్ శనివారం కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించి పలువురు బీజేపీ నాయకులను కలిశారు. అనంతరం కూకట్పల్లి లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించేందుకు బీజేపీ అన్న విధాల సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణలో పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలిచేందుకు గాను అన్ని విధాలుగా పని చేస్తున్నామని, బహిరంగ సభలు, రోడ్ షోలతో కమలం పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నారని అన్నారు.
ప్రధాని మోదీ సారధ్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశ గతిని మార్చిన ఘనత మోదీకే దక్కుతుందని, పేదరిక నిర్మూలనకు మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రజలలో మోదీ బలమైన నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడిందని అన్నారు. ఈ సారి 400 సీట్లు సాధించి అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరవయ్యారని ఆరోపించారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిందని, ఇంటింటికీ, గడప గడపకు మోదీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కమలం పువ్వు గుర్తును ప్రజల్లోకి చేరవేసేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి భారీ మెజార్టీతో గెలిపించి మల్కాజిగిరి సీటును మోదీకి బహుమతిగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్చార్జి మాధవరం కాంతారావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు సూర్య ప్రకాష్, రాజేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.