కోమటి కుంటకు ఎసరు..అక్రమార్కులకు బడా లీడర్ల అండదండలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు
దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ కబ్జాదారుల కన్ను చెరువులపై పడింది. అక్రమార్కులు శ్రీ రాముడి భూములనే కాదు.. చెరువులను కూడా వదలడం లేదు. అందుకు ప్రజా ప్రతినిధుల అండ తోడవడంతో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది. మేడ్చల్ జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్ లో ‘‘కోమటికుంట’’ చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్ , ఎస్ఆర్ ప్రకృతి పేరిట ఫంక్షన్ హాల్ ను నిర్మించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చెరువు కబ్జాపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా..గత ప్రభుత్వ అండతో అక్రమణదారులు యధేచ్చగా కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
విలువైన స్థలం హాంఫట్..
మేడ్చల్ మండలం పూడూరు గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 434, 43 3, 432 అదేవిధంగా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 62, 63, 61 లలో మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు ఉన్నది. సర్వేనెంబర్ 62 లో 14 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. దీనిలోని నాలుగు ఎకరాల 28 గుంటలు దేవాదాయ భూమి ఉన్నది. కాగా సింహం చెరువు యొక్క భూమి సర్వేనెంబర్ 62 లోని ఉన్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
డిప్యూటీ సీఎం ప్రస్తావన..
ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన చెరువులు పై నిర్వహించిన సమీక్షలు కోమటికుంట చెరువు కబ్జాంశం చర్చికి వచ్చింది. దాదాపుగా 8 ఎకరాల చెరువు భూమి కబ్జాలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ కబ్జాలో సింహభాగం ప్రకృతి నివాస్ తో పాటుగా ప్రకృతి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్స్ ఉన్నట్లుగా చూపించారు.అంతేకాకుండా ప్రకృతి నివాస్ వారు మేడ్చల్ మండలం పూడూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 434 లో సైతం కొంతమేర కబ్జా చేశారు. సర్వే నెంబర్ 434 లో 5 ఎకరాల ఎనిమిది గంటల ప్రభుత్వ భూమి (కోమటికుంట చెరువు) ఇక రికార్డులో ఉంది.
కుచించుకుపోతున్న చెరువు విస్తీర్ణం..
అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అదకార యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహారిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటి కుంట చెరువు పుల్ ట్యాంక్ లెవల్ ఏరియాలో ప్రకృతి ఫంక్షన్ హాల్, రిసార్ట్ తోపాటు చెరువులో నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి..శిఖంలో భారీ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం ముందస్తుగా మట్టి, రాళ్లతో నింపి ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మాణాలు చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నీటి పారుదల, తూంకుంట మున్సిపల్ ఆఫీసర్ల చేతివాటం, బాడా లీడర్ల భరోసాతోనే ఈ అక్రమ దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాదారుల నుంచి కోమటి కుంట చెరువు, శిఖం భూములను రక్షించాలని హైడ్రా అధికారులను స్థానికులు కోరుతున్నారు.