దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఆత్మగౌరవం, ఆర్థికాభివృద్ధిని కాపాడగలిగే శక్తి కేవలం మోదీకే ఉంది: ఈటల
దేశ రక్షణ, శాంతి భద్రతలు, దేశ ఆత్మగౌరవం, దేశ ఆర్థికాభివృద్ధిని
దిశ,కూకట్పల్లి: దేశ రక్షణ, శాంతి భద్రతలు, దేశ ఆత్మగౌరవం, దేశ ఆర్థికాభివృద్ధిని కాపాడగలిగే శక్తి కేవలం ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో ఈటెల రాజేందర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులను కలిసి వారి మద్దతును కోరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సమాజంలో మంచి, చెడులు తెలిసిన న్యాయవాదుల మద్దతు తనకు కావాలని కోరారు. అనంతరం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ గుడిసెలు, శ్రీశ్రీ నగర్ కాలనీలలో ఇంటింటికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలను, దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థికాభివృద్ధిని ఏక కాలంలో కాపాడగలిగే శక్తి కేవలం ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో డబ్బును, మద్యాన్ని నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని, బీజేపీ మాత్రం దేశాభివృద్ధిని చూపిస్తు ఓట్లు అడుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలను ఎన్నో ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మోసపూరిత మాటలను గ్రహించిన ప్రజలు అబ్కీ బార్ చార్సౌ పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ పార్టీకి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అనంతరం అల్లాపూర్ డివిజన్లోని రాజీవ్‌గాంధీ నగర్ సి బ్లాక్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.