ఒడవని సీట్ల ఫీట్లు.. బీజేపీలో జనసేన సీట్ల కుంపటి

కాషాయ పార్టీలో జనసేన చిచ్చు రేపుతోంది.

Update: 2023-11-03 12:20 GMT

దిశ ప్రతినిధి,మేడ్చల్ : కాషాయ పార్టీలో జనసేన చిచ్చు రేపుతోంది.బీజేపీ, జనసేన పొత్తుతో కమలం పార్టీ కకావికలమవుతోంది. మేడ్చల్ జిల్లాలో రెండు సీట్ల కోసం జనసేన పార్టీ పట్టుబడుతోంది. కూకట్ పల్లి, మల్కాజిగిరి రెండు స్థానాలు పొత్తులో భాగంగా తమకు వదిలేయాలని జనసేన ఒత్తి చేస్తుంది. కాషాయ పార్టీ నేతలు మాత్రం ఆ రెండు సీట్లను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు.సంస్థాగతంగా బలం లేని జనసేనకు సీట్లు ఇస్తే పార్టీని వీడేందుకు సిద్ధమని బీజేపీ నేతలు అధిష్టానం పెద్దలకు అల్టిమేటం జారీ చేయడం ఉత్కంఠకు దారితీస్తోంది.

బీజేపీ నేతల పట్టు

కమలం పార్టీకి బలమున్న స్థానాలనే జనసేన కోరుకుంటుంది.రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లాలోని కూకట్ పల్లి స్థానాలను కేటాయించాలని ముందుగా జనసేన పట్టుబట్టింది. అయితే చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో తాను చెప్పిన బీజేపీ వారికే టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో జనసేన శేరిలింగంపల్లి ఇవ్వకుంటే మల్కాజిగిరి అయినా ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమచారం. దీంతో రెండో జాబితాలో కూకట్ పల్లి, మల్కాజిగిరి సీట్లను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కూకట్ పల్లి, మల్కాజిగిరి సీట్లను ఎట్టి పరిస్థితుల్లో జనసేన కు ఇవ్వద్దని స్థానిక కమలం పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నా ల హరీష్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు,సీనియర్ నేత వడ్డేపల్లి రాజేశ్వర్ రావులు రాజీనామా అస్త్రాలు సంధించగా, శుక్రవారం వడ్డేపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి వెళ్లడం హాట్ టాపిక్ మారింది.

మల్కాజిగిరి చేజారేనా..!

కూకట్ పల్లి సీటుపై స్థానిక నేతలు పట్టు వదలని విక్రమార్కుల్లా అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో జనసేన చూపు మల్కాజిగిరిపైన పడింది. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్,. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయి ప్రసాద్ లు బీజేపీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. బీజేపీ మాత్రం మల్కాజిగిరి సీటును ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అయితే మల్కాజిగిరిలో ఆశావహులు సైతం సీటును వదులుకునే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ఇలా ..జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. జనసేన సేనాని పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహ వేడుకల్లో బీజేపీ గా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత సీట్ల పంచాయితీ తేలే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు జనసేనతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుందనేది చూడాలి మరీ..

Tags:    

Similar News