అధికారుల నిర్లక్ష్యం..తాగు నీరు వృథా..తప్పని వ్యధ
జలమండలి అధికారుల నిర్లక్ష్యం.. మంజీరా పైప్ లైన్ లీకేజీ నీరు ప్రధాన
దిశ, కీసర : జలమండలి అధికారుల నిర్లక్ష్యం.. మంజీరా పైప్ లైన్ లీకేజీ నీరు ప్రధాన రహదారిపై పొంగి పొర్లుతూ చిన్నపాటి కుంటను తలపిస్తుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద మంచి నీటి పైప్ లైన్ లీకేజ్ ఏర్పడింది. మంచినీటి లైన్ పగిలి దమ్మాయిగూడ మున్సిపాలిటీ ప్రధాన రహదారి నుండి బాలాజీ నగర్ కాలనీ ఫేస్ 2, రోడ్ నెం.4 లో నీరు వృధాగా ప్రవహిస్తుంది. దీంతో కాలనీ వాసులు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీరు కాలనీలోని రోడ్డుపై పారడంతో బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి మరమ్మతులు చేపట్టి, తాగునీటి వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కాలనీ వైపు కన్నెత్తి చూడని అధికారులు: బీజేపీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్
గత కొద్ది రోజులుగా మంచి నీరు వృధాగా పోతున్న అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కాలనీలోని రోడ్డుపై నీరు వృధాగా పారడంతో వాహనదారులు, ప్రజలు నడవలేని దుస్థితి నెలకొంది. బురద నీటిలో వాహన దారులు ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారులు సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాను.