వైద్య రంగంలో మరింత పురోగతి సాధించాలి
వైద్య రంగంలో మరింత పురోగతి సాధించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
దిశ,మేడ్చల్ బ్యూరో : వైద్య రంగంలో మరింత పురోగతి సాధించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. ఈఎన్‌టీలో అధునాతన పురోగతులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సౌత్ జోన్ ఈఎన్‌టీ సర్జన్స్ కాన్ఫరెన్స్ 2024ను శామిర్పేట్ లోని ఆలంకృత రిసార్ట్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుక్రవారం ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ తెలంగాణలో తొమ్మిదవది. సౌత్ జోన్లో పంతొమ్మిదవది. ప్రకృతి, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ కలిసే 'బేసిక్స్ అండ్ బియాండ్' అనే ఇతివృత్తంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ ది అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ (ఏఓఐ ఎస్ జెడ్) ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వైద్య రంగంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.
అసోసియేషన్ ఆఫ్ ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీఎస్ దీనదయాల్ మాట్లాడుతూ ఈ ఈవెంట్ సాంకేతికత ఈఎన్‌టీ సేవలను ఎలా మారుస్తుందో సూచిస్తుందన్నారు. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరోగ్య సంరక్షణను విప్లవాత్మకంగా మార్చబోతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ సదస్సులో నర్వ్ స్టిమ్యులేషన్ వంటి కొత్త చికిత్సలను ప్రదర్శించడానికి, వివిధ అలర్జీలకు అధునాతన చికిత్సలను చర్చించనున్నారని తెలిపారు. రోగి సంరక్షణను మెరుగుపరచడం, చికిత్సా ఖర్చులను తగ్గించడం, ఆధునిక పరిష్కారాలను అందించడం ఈ ఈవెంట్ లక్ష్యం అన్నారు.
ఈ సందర్భంగా ఓటోలరింగాలజిస్ట్ ఆఫ్ ఇండియా టీజీ సౌత్ కాన్ఫరెన్స్ సమన్వయకర్త డాక్టర్ డి. ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణాది ఈఎన్‌టీ శస్త్రచికిత్స నిపుణుల సదస్సు ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి అన్నారు. కాగా ఈ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులు జరగనున్న ఈ ఈవెంట్ ఈఎన్‌టీ నిపుణుల మధ్య సహకారం, జ్ఞానాన్ని పంచుకోవడం లక్ష్యంగా సాగనుంది. తద్వారా నైపుణ్యం, తాజా పురోగతులపై అవగాహన పెరుగుతుందని, వర్క్‌షాపులు, ఉపన్యాసాలు, పరస్పర చర్చలతో కూడిన సమగ్రమైన శిక్షణా అనుభవం లభిస్తుందని, సంప్రదాయ వైద్యం, ఆధునిక సాంకేతికత మధ్య వారధిగా ఈ ఈవెంట్ నిలుస్తుందని వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.