బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బుచమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం పరామర్శించారు.
దిశ, కూకట్పల్లి : హైడ్రా భయంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బుచమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ హైడ్రా చేస్తున్న అరాచకాలతో పేద ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని ఆరోపించారు. కూకట్పల్లి నల్ల చెరువులో తన బిడ్డకు పెండ్లి కానుకగా ఇచ్చిన ఇల్లు కూల్చేస్తారన్న భయంతో బుచ్చమ్మ ఆతహత్యకు పాల్పడిందని అన్నారు. నల్ల చెరువులో గత కొన్ని రోజులుగా షెడ్లను, నిర్మాణాలను కూల్చివేయడంతో తమ బిడ్డలు ఉంటున్న ఇండ్లను కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది.
వాటిని హైడ్రా అధికారులు కూలుస్తారని మనస్థాపంతో నాలుగు రోజులుగా మనోవేదనకు గురై శుక్రవారం రోజు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. హైడ్రా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు సైతం మృతికి సంబంధించిన కనీస వివరాలు చెప్పకుండా తప్పుడు సమాచారాలను పై అధికారులకు ఇవ్వడం సరైన పద్ధతి కాదని, చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, పగుడాల బాబురావు, బీఆర్ఎస్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.