బండి సంజయ్ పై మంత్రి మల్లారెడ్డి ఫైర్

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2023-03-11 13:36 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎమ్మెల్సీ కవితపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన బండి సంజయ్ కాదని మెంటల్ సంజయ్ అంటూ విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర గ్రామంలో సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

మహిళలు ఈ సృష్టికి మూలమని మహిళల సేవలను కొనియాడారు. అనంతరం బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సీఎం కేసీఆర్ కుమార్తె అయినందునే కేంద్ర ప్రభుత్వం కవితపై సిబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. మహిళ అని చూడకుండా బండి సంజయ్ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. ఇలా మాట్లాడితే బీజేపీ నాయకులను తెలంగాణలోని తిరగనివ్వబోమని మంత్రి హెచ్చరించారు.

ఈడీ, సీబీఐ దాడులకు సీఎం కేసీఆర్ భయపడే వ్యక్తి కాదన్నారు. బండి సంజయ్ తక్షణమే కవితకు క్షమాపణ చెప్పాలని, లేదంటే మహిళలు చీపుర్లతో సమధానం చెప్తారని మల్లారెడ్డి హెచ్చరించారు. సర్పంచ్ మాధురి మాట్లాడుతూ.. బండి సంజయ్ కు మహిళలంటే గౌరవం లేదన్నారు. తక్షణమే మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మి నారాయణ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News